12 July, 2026 | 2:37 AM

నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం

12-07-2026 01:25 AM
  1. రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ
  2. జేఎన్టీయూహెచ్ సుల్తాన్‌పూర్ క్యాంపస్‌లో బస్సులు, ల్యాబ్‌లు ప్రారంభం 

సంగారెడ్డి , జూలై 11(విజయక్రాంతి): జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ సుల్తాన్‌పూర్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్,  విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కళాశాల బస్సులతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వీఎల్‌ఎస్‌ఐ సిస్టమ్ డిజైన్ అండ్ సిమ్యులేషన్ ల్యాబొరేటరీ, స్మార్ట్ కంప్యూటింగ్ ల్యాబొరేటరీ, కంప్యూటర్ అప్లికేషన్స్ ఇన్ ఫార్మసీ ల్యాబొరేటరీలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్ ఉపకులపతి ప్రొఫెసర్ టి.కిషన్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్ ఆర్.పాండు, జేఎన్టీయూహెచ్ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ నాణ్యమైన సాంకేతిక విద్య అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సుల్తాన్‌పూర్ క్యాంపస్ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, ఆధునిక ప్రయోగశాలలు విద్యార్థులకు ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంపై ప్రాయోగిక అవగాహన కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలను మరింత పెంచుతాయని తెలిపారు.

తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్) నిధుల ద్వారా రెండు కళాశాలలకు బస్సులను అందించడం అభినందనీయమని పేర్కొ న్నారు.   క్యాంపస్‌లో ప్రతిపా దిత క్లాక్ టవర్ నిర్మాణ స్థలాన్ని మంత్రి పరిశీలించి, నిర్మాణ రూపకల్పన, వ్యయ అంచనాలను త్వరితగతిన సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కళాశాల ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, అందోల్ క్యాంపస్ నిర్మాణానికి రూ.57 కోట్లు మంజూరైనట్లు వెల్లడించిన మంత్రి, భవనాల నిర్మాణానికి సంబంధించిన స్ట్రక్చరల్ డిజైన్ను వెంటనే సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

జేఎన్టీయూహెచ్ ఉపకులపతి ప్రొఫెసర్ టి.కిషన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్ డైరెక్టర్ డాక్టర్ ఎ.దామోదరం, చీఫ్ ఇంజనీర్ ఎస్. శ్రీనివాసులు, జేఎన్టీయూహెచ్ యూ నివర్సిటీ కళాశాల ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ప్రిన్సిపాల్ సునీత రెడ్డి, యూనివర్సిటీ కళాశాల ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్ ఎస్. విశ్వనాథ రాజు, వైస్ ప్రిన్సిపాల్ వై. రాఘవేందర్ రావు, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, తోషిబా సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.