12 July, 2026 | 1:31 AM

దళిత బంధు సొమ్ము కాజేసేందుకు యత్నం

12-07-2026 12:34 AM
  1. భర్త చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ తీసుకున్న భార్య
  2. విషయం వెలుగులోకి రావడంతో విచారణ చేపట్టిన పోలీసులు 

కామారెడ్డి, జూలై 11 (విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలాన్ని దళిత బంధు పథకం కింద పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 1298 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 10 లక్షల విలువైన యూనిట్లను పంపిణీ చేసింది. ఈ పథకం కింద నిజాంసాగర్ మండల కేంద్రానికి చెందిన బొమ్మ గళ్ళ మొగులయ్యకు 10 లక్షలు మంజూరు చేసి అతని ఖాతాలో జమ చేశారు. అప్పటికే మొగులయ్య కనిపించకుండాపోవడంతో ఆ డబ్బులను తీసుకునేందుకు భార్య చంద్రకళ మరో వ్యక్తితో కలిసి తన భర్త చనిపోయినట్లు గ్రామపంచాయతీ సెక్రెటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి డెత్ సర్టిఫికెట్ తీసి బ్యాంక్ మేనేజర్‌ను కలిసారు.

అయితే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కావాలని బ్యాంక్ మేనేజర్ చెప్పడంతో అసలు రంగు బయటపడింది. పంచాయతీ సెక్రెటరీ, ఎంపీడీవోలకు విషయం తెలియడంతో  పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజాంసాగర్ ఎస్‌ఐ శివకుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దళిత బంధు డబ్బులు 10 లక్షలు కాజేసేందుకు అదృశ్యమైన భర్త మొగులయ్య మృతి చెందాడని చంద్రకళ, మరోవ్యక్తితో కలిసి పంచాయ తీ సెక్రెటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి డెత్ సర్టిఫికెట్ పొందినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. ఈ విషయంపై లోతుగా నిజాంసాగర్ పోలీసులు విచారణ చేపట్టారు. ఇంకా ఎవరెవరి ప్రమోయమొందని కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం లేపుతుంది.