12 July, 2026 | 2:37 AM

నావికాదళంలోకి ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

12-07-2026 01:27 AM
  1. విశాఖలో ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్
  2. సావలంబన, ఆత్మనిర్భర్‌కు నిదర్శనమన్న మంత్రి

విశాఖపట్నం, జూలై 11: భారత రక్షణ రంగం అత్యాధునిక సాంకేతికత, తయారీ రంగంలో దూసుకుపోతుందని, స్వావలంభనకు నిదర్శనంగా నిలుస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శనివారం ఎండీఎల్ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి’ని విశాఖ తూర్పు నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్‌లో యుద్ధాల స్వభావం పూర్తిగా మారిపోతుందని, డ్రోన్లు, సైబర్ దాడుల సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని, అన్ని ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు.

ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి ప్రారంభం భారతదేశ రక్షణ తయారీ రంగం సాధిస్తున్న విజయాలకు సంకేతమన్నారు.  నౌకలోని ప్రత్యేకతలను వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్లు, సైబర్ వార్‌ఫేర్, హైపర్‌సోనిక్ ఆయుధాలు, అంతరిక్ష ఆధారిత వ్యవస్థలు, మానవరహిత ప్లాట్‌ఫామ్‌లు వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు ఆధునిక యుద్ధ రూపరేఖలను మారుస్తున్నాయని, సాంప్రదాయ సైనిక సామర్థ్యాలు కూడా అంతే ముఖ్యమైనవిగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

భవిష్యత్‌లో కృత్రిమ మేధతో యుద్ధాలు జరుగుతాయన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా జాతీయ భద్రతను కాపాడుకున్నామని, సైనిక సామర్థ్యాలను నిరూపించుకున్నామని, అదే సమయంలో అధునాతన సాంకేతికతలను విజయవంతంగా ఉపయోగించుకోవడం గర్వకారణంగా పేర్కొన్నారు. సముద్ర భద్రత, నిఘాలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి కీలక పోషిస్తుందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆకాంక్షించారు. ఎండీఎల్ (ముంబై మజగావ్ డాక్ యార్డు లిమిటెడ్) నిర్మించిన ఈ నౌకలో 75 శాతానికి పైగా స్వదేశీ పరికరాలున్నాయి. నౌకాదళ వాయు రక్షణ, ఉపరిత, జలాంతర్గామి, సముద్రంలో నిఘా, శత్రువులపై దాడులు, మానవతా సహాయం, విపత్తులపై అప్రమత్తత లాంటి కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తుంది.