12 July, 2026 | 1:32 AM

కాంగ్రెస్‌లో రోజుకో వివాదం!

12-07-2026 12:28 AM
  1. ఎమ్మెల్యే కడియం, మంత్రి కొండా సురేఖ మధ్య విభేదాలు
  2. తన శాఖపై కడియం రివ్యూ చేశారని మంత్రి అభ్యంతరం
  3. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు
  4. తుంగతుర్తిలో ఎమ్మెల్యే సామేల్ వర్సెస్ ఎంపీ చామల  

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి) : అధికార కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు, సీనియర్ల మధ్య ఆధిపత్య పోరు, మంత్రులు, ఎమ్మెల్యేల వర్గ విభేదాలు రోజువారీ పరిణామాలయ్యాయి.  దీనికి తోడు కొందరు నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పార్టీకి తలనొప్పిగా మారింది. ఇటీవలే కామారెడ్డికి చెందిన మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, చంద్రశేఖర్‌రెడ్డి మధ్య నెలకొన్న వివాదం పార్టీలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఆ వివాదం సమిసిపోయిందనుకునేలోపే.. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి బయటికి రావడం పార్టీలో హాట్‌టాఫిక్‌గా మారింది.

తనకే తెలియకుండా తన శాఖపై కడియం శ్రీహరి రివ్యూ చేశారంటూ మంత్రి సురేఖ సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు . ఇది ప్రొటోకాల్ ఉల్లంఘన కిందకే వస్తుందని వారికి వివరించారు. కడియం శ్రీహరిపై పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 14న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్‌కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు మంత్రి కొండా సురేఖ చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మంత్రి కొండా సురేఖ, కొందరు ఎమ్మెల్యేల మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతోంది. 

తుంగతుర్తిలో రచ్చరచ్చ

తాజాగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్యెల్యే సామేల్, స్థానిక నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఇక్కడ పార్టీ నాయకులు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గాలుగా విడిపోయారు.  పార్టీ పదవుల విషయంలో మొదటి నుంచి పనిచేసే వారికి ఎమ్మెల్యే అన్యాయం చేస్తున్నారని ఎంపీ చామల వర్గీయులు అంటున్నారు. వీరంతా గాంధీభవన్‌కు వచ్చి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.

అదే విధంగా బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు వ్యతిరేకంగా ఆ నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులు గాంధీభవన్‌కు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో ఉన్నారా? బీఆర్‌ఎస్‌లో ఉన్నారా? అనేది స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.  ఇదే తరహాలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి చంద్రశేఖర్‌కు వ్యతిరేకంగా గాంధీభవన్‌లో నిరసన తెలిపారు.   

పార్టీని, కేడర్‌ను పట్టించుకోవడం లేదంటూ ఆందోళన చేపట్టారు. ఇక పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, స్థానిక నేతల మధ్య వివాదం క్రమశిక్షణ కమిటీ ముందు ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటస్వామికి క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీచేయగా, ఆయన వివరణ ఇచ్చారు. అచ్చంపేట ఎమ్మెల్యే  వంశీకృష్ణ.. ఎన్నారై సెల్ ప్రతినిధి అమరేందర్‌రెడ్డిపై ఫిర్యాదు చేయడంతో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. సిద్దిపేట జిల్లాలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, లోకల్ లీడర్ల వివాదం కూడా క్రమశిక్షణ కమిటీ ముందుకు వస్తే దానిపైనా విచారణ జరిపారు.

వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి.. మాజీమంత్రి చిన్నారెడ్డి మద్య విభేదాలు కొనసాగుతున్నాయని పార్టీవర్గాలు తెలిపాయి. జగిత్యాల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్, పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డికి మధ్య నెలకొన్న విషయం తెలిసిందే. చివరికి జీవన్‌రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ గూటికి చేరారు. కామారెడ్డిలో పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి టీపీసీసీ జనరలో సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి క్రమశిక్షణ కమిటీకి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.

విభేదాలు తీవ్రం కావడంతో క్రమశిక్షణ కమిటీ విచారణ జరిపింది. ఇరు నేతల మధ్య కమిటీ సక్యత కుదర్చడంతో కథ సుఖాంతమైంది. పార్టీలో కొందరు నేతల మధ్య ఏదో రకంగా విభేదాలు నెలకొనడంపై పార్టీ కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతర్గత కుమ్ములాటలు, సమన్వయం లోపం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి   చేస్తోంది.

కడియంకు కొండా సురేఖ కౌంటర్ 

 కడియం శ్రీహరికి మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. మొదటి నుంచి కడియం శ్రీహరి బుద్ధి ఇలాగే ఉంటుందని, గతంలో మంత్రిగా పనిచేసిన ఆయన.. ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా ఇమడలేకపోతున్నారని విమర్శించారు. ఇమడలేని పక్షంలో పదవికి రాజీనామా చేసి ఇంట్లోనైనా కూర్చోవాలి.. లేదంటే రాజీనామా చేసి  మళ్లీ గెలిచి మంత్రి పదవి తెచ్చుకోవాలి. నన్ను బ్లేమ్ చేయాలనుకున్నా.. జిల్లాను డిస్ట్రబ్ చేయాలనుకున్నా ఊరుకోనని  హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడికి వినతిపత్రం ఇచ్చిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. 40 ఏళ్లు రాజకీయ అనుభవం, 15 ఏళ్లు మంత్రిగా పని చేసిన కడియం శ్రీహరికి నియమ నిబంధనలు తెలియవా? అని ప్రశ్నిస్తున్నారు.

రూల్స్ తెలిస్తే తాను చేసింది తప్పు అని ఒప్పుకోకుండా..  తనపైనే ఎదురు దాడికి దిగడం సరికాదన్నారు. శ్రీహరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను అని చెప్పుకుంటూ బిడ్డను మాత్రం కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిపించుకున్నారని, నిజంగా ఆయనకు విలువలు ఉంటే రాజీనామా చేసి గెలవాలన్నారు. గతంలో నేను పార్టీ మారినప్పుడు నా భర్త కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు.  శ్రీహరి కాంగ్రెస్‌లోకి రాకముందు పార్టీలో అంతా సవ్యంగా ఉందని, ఆయన రావడంతోనే ఇవ్వన్నీ జరుగుతున్నాయని పేర్కొన్నారు.

పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించం : పీసీసీ చీఫ్

మాజీ మంత్రి కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ ఫిర్యాదుపై పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య వివాదాలు, గ్రూప్ రాజకీయాలపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నామని వివరించారు. త్వరలోనే కొండా సురేఖ, కడియం శ్రీహరి ఇద్దరితో మాట్లా డి.. వివాదాన్ని పరిష్కరిస్తామని చెప్పారు. ప్రభుత్వంతో పాటు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని చేశారు. 

రోడ్డెక్కి కొట్టుకుంటే చులకన అవుతాం: ఎంపీ చామల

తుంగతుర్తి నియోజకవర్గంలో ఇరువర్గాల కాంగ్రెస్ నేతల ఘర్షణపై ఎంపీ చామల స్పందించారు. ఎమ్మెల్యే మందుల సామేల్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ఇరు వర్గాల నేతల కొట్లాటపై ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి స్పందించారు. రొడెక్కి కొట్టుకుంటే చులకన అవుతామని కార్యకర్తలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.  నాకు, ఎమ్మెల్యే మందుల సామేల్ ఎలాంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేదని కార్యకర్తలే మమ్మలను గుండెల్లో పెట్టుకుని గెలిపించారని పేర్కొన్నారు. 

తాను విదేశాల్లో ఉన్నప్పుడు మండల అధ్యక్షుల నియామకంపై కార్యకర్తలు అంసతృప్తి వ్యక్తం చేస్తూ తనకు ఫోన్ చేయడంతో పాటు బహిరంగంగా మాట్లాడారని.. తానే పీసీసీ చీఫ్, ఏఐసీసీ వ్యవహరాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు లేఖ రాసినట్లు ఎంపీ చెప్పారు.  నియమించిన మండల అధ్యక్షులను తొలగించాలని లేఖలో ఎక్కడా కోరలేదని, కేవలం నిర్ణయం వెల్లడిని ఆపాలని మాత్రమే కోరానన్నారు.