తెలంగాణ త్వరలో.. బుల్లెట్ ట్రైన్ హబ్
- హైదరాబాద్, చెన్నై, బెంగళూరులను కలుపుతూ బుల్లెట్ ట్రైన్లు
- ఏడు బుల్లెట్ రైళ్లలో మూడు రూట్లు తెలంగాణకే
- రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు నిధులు
- వికసిత్ భారత్ సదస్సులో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
- సాంకేతికతను సృష్టించి ప్రపంచానికి అందించాలి
- ఆధార్, యూపీఐకి ప్రపంచస్థాయి గుర్తింపు
- మూడో అతిపెద్ద స్టార్టప్ ఇకోసిస్టమ్‌గా భారత్
- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): రాబోయే రోజుల్లో తెలంగాణ దేశంలోనే ఒక పెద్ద బుల్లెట్ ట్రెయిన్ హబ్‌గా అవతరించబోతోందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరును కలుపుతూ బుల్లెట్ ట్రైన్లు రానున్నాయని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న ఏడు బుల్లెట్ రైళ్లలో మూడు రూట్లు తెలంగాణకే దక్కాయన్నారు.
ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ వల్లే రాష్ట్రానికి ఈ భారీ ప్రాజెక్టులు వచ్చాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే ప్రయా ణ సమయాలు ఊహించని విధంగా తగ్గిపోతాయన్నారు. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు నిధులిచ్చామని కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్ తెలిపారు.
సాంకేతికతను సృష్టించి ప్రపంచానికి అం దించాలని, ఆధార్, యూపీఐలకు ప్రపం చ గుర్తింపు పొందాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మూడో అతిపెద్ద స్టార్టప్ ఇకోసిస్టమ్‌గా భారత్ అవతరిస్తోందని, దేశంలోనే అతిపెద్ద కేంద్రాల్లో హైదరాబాద్ ఒకటని అన్నారు.
హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో ‘వికసిత్ భారత్ సాంకేతికత పాత్ర’ అనే అంశంపై శనివారం నిర్వహించిన సదస్సు లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి అశ్వి నీవైష్ణవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ, ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులకు బుల్లెట్ రైళ్లతో ప్రయాణ కష్టాలు పూర్తిగా తీరిపోనున్నాయన్నారు. బుల్లెట్ రైలు ఎక్కితే హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవ లం ఒక గంట పది నిమిషాల్లోనే చేరుకోవచ్చన్నారు.
అలాగే వ్యాపార రాజధాని ముంబైకి రెండు గంటల ఇరవై నిమిషా లు, చెన్నై నగరానికి కేవలం రెండు గంటల్లోనే దూసుకుపోవచ్చని వివరించారు. ఈ ప్రాజెక్ట్ దేశ రవాణా రంగంలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల క్రెడిట్ కోసం కొం దరు పాకులాడుతున్నారంటూ విపక్షాలపై ఆయన మండిపడ్డారు. దీని పూర్తి క్రెడిట్ ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు.
గత యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే బడ్జెట్‌లో కేవలం రూ.880 కోట్లు ఇస్తే.. మోదీ ప్రభుత్వం కేవలం తెలంగాణకే రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా 1,300 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు చేపట్టామని వివరించారు.
ఇప్పటికే 260 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పూర్తయ్యిందని తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణలో 40 రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు నిధులు ఇచ్చామని ఆయన వెల్లడించారు. మోదీ ఇస్తున్ననిధుల వరద వల్లే రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయని స్పష్టంచేశారు.
అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. సాంకేతికత వికసిత భారత్‌కు గుండెకాయ లాంటిదని, సాంకేతికతను వేరే దేశాల నుంచి తీసుకోవడం వరకు మాత్రమే పరిమితం కాకూడదని, సాంకేతికతను మనమే సృష్టించాలి.. తయారు చేయాలి.. భద్రపరచాలి.. ప్రపంచానికి అందించాలన్నారు. ఈ విషయంలో గత పదేళ్లుగా బలమైన పునాదులు నిర్మించామన్నారు.
నేడు ప్రపంచం లోనే అత్యంత బలమైన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థల్లో ఒకటి మన దేశం ఉందని, మన వద్ద అమలు చేస్తున్న ఆధార్, యూపీఐ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని తెలిపారు. గత పదేళ్లలో యూపీఐ లావాదేవీల సంఖ్య ఏడాదికి 2 కోట్ల నుంచి 24,162 కోట్లకు పైగా పెరిగిందని, ఇది దాదాపు 12,000 రెట్ల వృద్ధి అన్నారు. రూ.314 లక్షల కోట్లకు పైగా లావాదేవీల విలువతో యూపీఐ ప్రపంచంలోనే అతిపెద్ద డియజిటల్ ఆర్థిక చెల్లింపు వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిందన్నారు.
సెమీకం డక్టర్ డిజైన్‌లో దేశంలోనే అతిపెద్ద కేంద్రా ల్లో హైదరాబాద్ ఒకటని, ప్రపంచానికి అవసరమైన అత్యాధునిక సాంకేతికతల అభివృ ద్ధి ఇక్కడే జరుగుతోందన్నారు. అత్యాధునిక రైల్వే భద్రతా వ్యవస్థ ‘కవచ్’ హైదరాబాద్‌కు మరో గుర్తింపన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా వేగంగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం.. అంతేకాకుండా అత్యంత తక్కువ డేటా ధరలను అందిస్తూ, దేశంలోని మారుమూల ప్రాంతాలకు డిజిటల్ కనెక్టివిటీని చేరువచేశామన్నారు.
డిజిటల్ కనెక్టివిటీతో మన యువతలోని ప్రతిభ, సామర్థ్యాలకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. దేశంలోని ఎలక్ట్రాని క్స్ తయారీ రంగం 13 లక్షల కోట్ల పరిశ్రమగా విస్తరించిందన్నారు. మొబైల్ ఫోన్ దిగుమతులపై దాదాపు ఆధారపడటంలేదని, అత్యాధునిక డీప్-టెక్ సాంకేతిక ఆవిష్కరణలను కూడా అభివృద్ధి చేస్తున్నామని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్‌టెక్, స్పేస్‌టెక్, అగ్రిటెక్ తదితర రంగాల్లో మన దేశీయ స్టార్టప్లు ఘనమైన విజయాలు సాధిస్తున్నాయన్నారు. అమెరికా, చైనా తర్వాత మూడో అతిపెద్ద స్టార్టప్ ఇకోసిస్టమ్‌గా భారత్ నిలిచిందన్నారు.
ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ‘ఐటీ’
త్వరలోనే హైదరాబాద్ నగరం దేశంలోని 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో మూడు కారిడార్లకు కేంద్రంగా మారనుందని కిషన్‌రెడ్డి తెలిపారు. దీంతో హైదారాబాద్ నుంచి బెంగళూరు, పుణే, చెన్నై నగరాలతో మెరుగైన అనుసంధానం, సులువుగా సాగించే అవకాశం కలుగుతుందని చెప్పారు. 42 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేపడుతున్నామననారు.
అలాగే నాంపల్లి రైల్వే స్టేషన్‌ను కూడా రూ.350కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఐటీ రంగంలో బెంగళూరుతో సమానంగా హైదరాబాద్ పోటీ పడుతోందని, వరంగల్, కరీంనగర్ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.






