12 July, 2026 | 1:57 AM

ఈ ఏడాది నీటి కష్టాలు తీరేదెలా?

12-07-2026 12:51 AM
  1. వర్షాలే అన్నింటికీ ప్రధాన నీటి వనరు
  2. ఎల్ నినో ప్రభావంతో తగ్గనున్న వర్షపాతం
  3. ఎగువ రాష్ట్రాల్లో కురిసే వర్షపు నీటినీ ఎత్తిపోసే అవకాశం లేదు
  4. వచ్చే సీజన్‌కే అందుబాటులోకి మేడిగడ్డ వద్ద పంపింగ్
  5. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత.. సాగు, తాగు నీటి నిర్వహణపై అనిశ్చితి

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం సాగు, తాగునీటికి సంబంధించి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పుడు గోదావరి వరదలను ఎత్తిపోసి లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన కాళేశ్వరం.. బరాజ్ కుంగు బాటు కారణంగా ఇప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులో లేదు. మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలపై అనిశ్చితి నెలకొంది. ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే వరద జలాలపైనా భరోసా తగ్గుతోంది.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది తెలంగాణలో సాగు, తాగునీటి భవిష్యత్తు పూర్తిగా నైరుతి రుతుపవనాలపైనే ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. వర్షం కురిస్తేనే ప్రాజెక్టులు నిండుతాయి.. చెరువులు కళకళలాడతాయి.. బోర్లు బతుకుతా యి.. రైతు ఊపిరి పీల్చుకుంటాడు. వర్షాలు నిరాశపరిస్తే మాత్రం నీటి నిర్వహణే ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా మారనుంది. వ్యవసా యం, తాగునీటి సరఫరా, పశుసంవర్ధక రం గం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వంటివన్నీ వర్షాలపైనే ఆధారపడి ఉంటాయి.

తెలంగాణ లో మొత్తం వార్షిక వర్షపాతంలో దాదాపు 80 శాతానికి పైగా నైరుతి రుతుపవనాల కాలంలోనే కురుస్తుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పడే ఈ వర్షాలే ఖరీఫ్ పంటల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అయితే వర్షాలు తగ్గినా, ఆలస్యంగా వచ్చినా లేదా మధ్యలో ఎక్కువ విరామాలు వచ్చినా దాని ప్రభా వం మొత్తం నీటి వ్యవస్థపై పడుతుంది.

ప్రాజెక్టుల్లో నిల్వలు తగ్గిపోతాయి, చెరువులు పూర్తిగా నిండవు, భూగర్భ జలాల మట్టం పడిపోతుంది. దీంతో సాగు విస్తీర్ణం తగ్గడమే కాకుండా, తాగునీటి సరఫరాపైనా ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఏడాది కాళేశ్వరం పూర్తిస్థాయిలో అందుబాటులో లేని పరిస్థితిలో, రాష్ట్రానికి వర్షాల ప్రాధాన్యం మరింత పెరిగింది. ఈ వానాకాలం ఎలా ఉంటుందన్నదే తెలంగాణలో సాగు, తాగునీటి పరిస్థితిని నిర్ణయించే కీలక అంశంగా మారింది. 

వచ్చే సీజన్ నాటికే మేడిగడ్డ వద్ద ఎత్తిపోతలు

గోదావరిలో వరదలు వచ్చిన వెంటనే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వా రా నీటిని ఎత్తిపోసి మిడ్ మానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌తోపాటు అనేక రిజర్వాయర్లను నింపే అవకాశం ఉండేది. దీంతో వర్షాలపై ఆధారపడే పరిస్థితి కొంతవరకు తగ్గి, అవసరమైన సమయంలో సాగు నీటిని అందించే వీలు కలిగేది. అయితే మేడిగడ్డ బరాజ్‌లో తలెత్తిన నిర్మాణ సమస్యల తర్వా త పరిస్థితి పూర్తిగా మారింది.

బరాజ్ పూర్తిస్థాయిలో పనిచేయకపోవడంతో గోదావరిలో వచ్చే వరద జలాలను గతంలా భారీ స్థాయిలో ఎత్తిపోసే అవకాశం ప్రస్తుతం లేదు. ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టు సామ ర్థ్యం పరిమితమైంది. మేడిగడ్డ మరమ్మతులు కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే సా గు సీజన్ నాటికే అక్కడ పంపింగ్‌ను పునరుద్ధరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

దీని ప్రభావం కేవలం సాగునీటికే పరిమితం కాదు. కాళేశ్వరం ద్వారా నింపే రిజర్వాయర్లపై ఆధారపడిన అనేక ప్రాంతాల్లో తాగు నీటి భద్రత, చెరువుల నింపుదల, భూగర్భ జలాల రీఛార్జ్ కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. గోదావరిలో మంచి వరదలు వచ్చినా వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశం లేకపోవడం ఈ ఏడాది రాష్ట్రానికి ప్రధాన సవాలుగా మారింది.

చెరువులు నిండితేనే బోర్లకు జీవం

తెలంగాణ నీటి వ్యవస్థలో చెరువులు కేవ లం సాగునీటి వనరులు మాత్రమే కాదు.. భూగర్భ జలాలను కాపాడే సహజ రీచార్జ్ కేంద్రాలుగా పనిచేస్తాయి. రాష్ట్రంలో వేలాది చెరువులు నిండితేనే వర్షపు నీరు భూమిలోకి ఇంకి, బోర్లు, బావుల్లో నీటి మట్టం  పెరుగుతుంది. రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు ఇప్పటికీ బోర్లపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో ఖరీఫ్ తర్వాత రబీ పంటలు పూ ర్తిగా భూగర్భ జలాలపైనే ఆధారపడతాయి.

చె రువులు నిండితే బోర్లు నెలల తరబడి నీటిని అందిస్తాయి. అదే చెరువులు నిండకపోతే భూగర్భ జలాల మట్టం క్రమంగా పడి పోతుంది. గతంలో అమలు చేసిన మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాల వల్ల అనేక చెరువుల నిల్వ సామర్థ్యం పెరిగినా, వాటి అసలు ప్రయోజనం లభించా లంటే సమృద్ధిగా వర్షాలు కురవాల్సి ఉంది. ఈ ఏడాది కాళేశ్వరం పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం, ఎల్ నినో ప్రభా వం తో వర్షాలపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో చెరువు ల ప్రాధాన్యం మరింత పెరిగింది.

పెద్ద ప్రాజెక్టులు పూర్తిగా నిండకపోయినా, స్థానికంగా మంచి వర్షాలు కురిసి, చెరువు లు నిండితే భూగర్భ జలాలు గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. అయితే వర్షాలు తగ్గే అవకాశం ఉండటంతో ప్రభు త్వం ఎప్పటికప్పుడు వర్షాల పరిస్థితిని సమీక్షిస్తూ, రైతుల కు పంటల ఎంపికపై సూచనలు ఇవ్వడం, విత్తనాల లభ్యతను నిర్ధారించడం, అవసరమైతే ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రణాళికను అమలు చేయాలి.

ఆందోళనకరంగా ఎల్ నినో ప్రభావం

ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో నీటి పరిస్థితి గందరగోళంగా మా రింది. దేశంలో ముఖ్యంగా నైరుతి రుతుపవనాల తీవ్రత, వర్షాలపై ఎల్ నినో ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయంతో పాటు నీటి నిర్వహణ కూడా క్లిష్టంగా మారుతుంది. తెలంగాణలో దీని ప్రభావం మరింత ఎక్కువగా కనిపించే అ వకాశం ఉంది. ఎందుకంటే చెరువులు, రిజర్వాయర్లు, భూగర్భ జలాలు అన్నీ వర్షాలపైనే ఆధారపడి ఉంటాయి.

ఎల్ నినో ప్రభావం తెలంగాణకే పరిమితం కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక వంటి ఎగువ రాష్ట్రాల్లో కూడా ఉండనుంది. వర్షాలు తగ్గితే గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహాలు తగ్గే ప్ర మాదం ఉంది. దీంతో శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, నాగార్జునసాగర్ వంటి ప్రధాన ప్రాజెక్టులకు వచ్చే నీటి పరిమాణం కూడా తగ్గవచ్చు. దీనికి తోడు గత కొన్నేళ్లుగా ఎగువ రాష్ట్రాలు తమ పరిధిలో కొత్త రిజర్వాయ ర్లు, బరాజ్‌లు, ఎత్తిపోతల పథకాలను అభివృద్ధి చేస్తున్నాయి.

దీంతో వరద నీటిలో కొంత భాగం అక్కడే వినియోగమవుతోం ది. అలాంటి పరిస్థితుల్లో తక్కువ వర్షపాతం నమోదైతే దిగువకు చేరే నీటి పరిమాణం మరింత తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో గోదావరి వరద జలాలను గతంలా భారీగా ఎత్తిపోసే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గితే రాష్ట్రం ఎదుర్కొనే నీటి సవాళ్లు మరింత తీవ్రమ య్యే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం.

తాగునీటికి కూడా సవాలే...

వాస్తవానికి సాగునీటి కంటే తాగునీటికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇ వ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది వర్షాలు ఆశించిన మేర కురవకపోతే, తాగునీటి నిర్వహణ కూడా ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో గ్రా మీణ, పట్టణ ప్రాంతాలకు సరఫరా చేసే తాగునీటి వ్యవస్థ ప్రధానంగా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, భూగ ర్భ జలాలపైనే ఆధారపడి ఉంది.

మిష న్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి పైప్‌లైన్ ద్వారా తాగునీరు అందిస్తున్నప్పటికీ, ఆ పథకానికి అవసరమైన నీరు శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, నాగార్జునసాగర్, సింగూరు, ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ వంటి జలాశ యాల నుంచే వస్తుంది. ఈ జలాశయా ల్లో నీటి నిల్వలు తగ్గితే తాగునీటి సరఫరాపై కూడా ప్రభావం పడనుంది. మ రోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వేలాది గ్రామాలు బోర్లు, బావులపైనే ఆధారపడుతున్నాయి.

వర్షాలు తగ్గితే భూగర్భ జలాల మట్టం పడిపోవడంతో బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉంది. దీంతో వేసవిలో తాగునీటి కొరత మ రింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుం ది. హైదరాబాద్‌తో పాటు వేగంగా విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాల్లో కూడా రోజు రోజుకూ తాగునీటి డిమాండ్ పెరుగుతోంది. జనాభా పెరుగుదల, పట్టణీక రణ, పారిశ్రామిక అవసరాల కారణం గా నీటి వినియోగం ప్రతి ఏడాది అధికమవుతోంది.

అలాంటి సమయంలో ప్రాజెక్టుల్లోకి తగినంత నీరు చేరకపోతే, అందుబాటులో ఉన్న నీటిని అత్యంత జాగ్రత్తగా వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభు త్వం ఒకవైపు తాగునీటికి తొలి ప్రాధా న్యం ఇస్తూనే, మరోవైపు సాగునీటి వి డుదలను కూడా సమతుల్యం చేయా ల్సి ఉంటుంది. నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేకపోతే సాగుతాగునీటి మధ్య సమన్వయం ఈ ఏడాది అతిపెద్ద పరిపాలనా సవాలుగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.