12 July, 2026 | 2:35 AM

తగ్గేదిలే.. తలొగ్గేది లే !

12-07-2026 01:32 AM
  1. ఇరాన్‌పై వెయ్యి క్షిపణులతో దాడి చేస్తాం: ట్రంప్
  2. బెదిరేది లేదని ఇరాన్ కౌంటర్

వాషింగ్టన్ /టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి మాటల యుద్ధం సాగుతున్నది. ఇరాన్ తనను మట్టుపెట్టేందుకు పావులు కదుపుతున్నదని, అంతదాక వస్తే వెయ్యి క్షిపణులతో ఇరాన్‌పై దాడి చేస్తామని తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఆ వ్యాఖ్యలకు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ కూడా స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. యూఎస్ దాడులు చేస్తుంటే, తాము చూస్తూ ఊరుకోమని.. ప్రతిగా రెట్టింపు దాడులు చేస్తామని గట్టిగా బదులిచ్చారు. నిన్నమొన్నటివరకు స్తబ్దుగా ఉన్న రెండు దేశాలు, మళ్లీ పరస్పరం హెచ్చరికలు చేసుకోవడం పశ్చిమాసియా దేశాల్లో ఆందోళన రేపుతున్నది.

ట్రంప్.. ఇంకా ఏమన్నారంటే.. ఇరాన్‌ను సర్వనాశనం చేయాలని, ఇప్పటికే తాను అమెరికన్ సైన్యానికి ఆదేశాలిచ్చినట్లు ప్రకటించారు. తనపై తక్షణమే దాడి జరుగుతుందనే అంశంపై ఎలాంటి నిఘా సమాచారం లేదని తెలిపారు. అలా అంటూనే.. ఇరాన్ తమతో శాంతిచర్చలకు సిద్ధంగా ఉందని ప్రకటించడం కొసమెరుపు. ట్రంప్ వ్యాఖ్యలపై.. ఇరాన్ నాయకత్వం కూడా తనదైన శైలిలో స్పందించింది. యూఎస్ సైనిక చర్యలకు దిగితే, తాము కూడా ప్రతీకార దాడులకు దిగుతామని ప్రతినబూనింది.