ప్రైవేట్ స్కూళ్లకు ‘అగ్ని సురక్షా’లో సడలింపులివ్వాలి
విపత్తు, అగ్నిమాపక శాఖకు ట్రస్మా నేతల వినతి
హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): ప్రైవేట్ పాఠశాలలకు అగ్నిసురక్షా నిబంధనలలో సడలింపులు కల్పించాలని తెలంగాణ రికగ్నైజ్‌డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎన్.రెడ్డి, జనరల్ సెక్రటరీ కె.అనిల్ కుమర్‌తో పాటు ఇతర నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ రంగనాథ్‌కు మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించారు.
తమ పాఠశాలలకు అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్‌వోసీ) జారీ చేసే సందర్భంలో కొన్ని అగ్నిసురక్షా నిబంధనలలో సడలింపులు కల్పించాలని కోరారు. ప్రస్తుతం అనేక పాఠశాలలు కొత్త భవనాలు, అపార్ట్‌మెంట్‌ల మధ్య చిక్కుకుపోయి, అగ్నిమాపక వాహనాలు పాఠశాల ప్రాంగణంలోకి సులభంగా ప్రవేశించలేని పరిస్థితిలో ఉన్నాయని, ఇవన్నీ దాదాపు 20 నుంచి 30 ఏళ్ల క్రితమే స్థాపించబడ్డాయన్నారు. ఈ పరిస్థితి పట్టణాభివృద్ధి వల్ల ఏర్పడిందని, అయినప్పటికీ, విద్యార్థులు, సిబ్బంది భద్రత కోసం తాము అన్ని సాధ్యమైన జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.






