9 June, 2026 | 1:50 AM

సర్వీస్ రోడ్ల ఆక్రమణ!

09-06-2026 12:08 AM
  1. కేపీహెచ్‌బీ సర్వీస్ రోడ్డులో వీధివ్యాపారులతో ట్రాఫిక్ జామ్
  2. సాయంత్రం అయితే నడవాలంటే నరకం
  3. రోడ్డును ఆక్రమించి స్టాల్స్ ఏర్పాటు చేసుకున్న వ్యాపారులు
  4. నిత్యం నరకయాతన అనుభవిస్తున్న స్థానికులు

కూకట్‌పల్లి, జూన్ 8 (విజయక్రాంతి): కేపీహెచ్‌బీ కాలనీ సర్వీస్ రోడ్‌లో కాలనీ మొదటి రోడ్డు నుండి జేఎన్టీయూ హెచ్ ప్రధాన గేటు వరకు ఉన్న సర్వీస్ రోడ్లు కొందరు చిరు వ్యాపారులు అక్రమంగా రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో సాయంత్రం అయితే ఆ దారిలో వెళ్లేలంటేనే నిత్యం నరకం అనుభవిస్తున్నమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు షాపింగ్ కాంప్లెక్స్ లలో ఉన్న షోరూమ్ లకు పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో రోడ్డు పక్కనే పార్కింగ్ చేస్తుండడంతో రోడ్డు మరింత ఇరుకుగా మారింది.

  • దారి పొడుగునా ఉన్న వీధి వ్యాపారుల వద్ద మహిళలకు సంబంధించిన వస్తువులు, బట్టలు, జువెలరీ తక్కువ ధరకే దొరుకుతాయేమో ప్రచారం ఉండడంతో కెపిహెచ్ బి కాలనీతోపాటు చుట్టుపక్కల ఉండే పలు కాలనీలా మధ్యతరగతి మహిళలు ఇక్కడ షాపింగ్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. దీంతో నిత్యం సాయంత్రం అయితే ఈ రహదారి జాతరను తలపిస్తుంది. సాధరన రోజుల్లో ఉండే రద్దీ కంటే పండగ సమయాలలో ఇసుక వేస్తే రాలనంత జనాలతో రద్దీగా మారుతుంది.

స్థానిక నాయకుల సహకారంతో తిరిగి ఏర్పాటు

ఈ సర్వీస్ రోడ్‌లో గతంలో కొందరు వీధి వ్యాపారులు స్టాల్స్ ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో ట్రాఫిక్ కు ఇబ్బంది అవుతుందని స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు పూర్తిగా తొలగించారు. అనంతరం స్థానిక నాయకుల సహకారంతో తిరిగి చిరు వ్యాపారులు ఇదే సర్వీస్ రోడ్లో స్టాల్స్ ఏర్పాటుకు పూనుకున్నారు. స్థానిక నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో వీధి వ్యాపారులకు అడ్డు అదుపు లేకుండా పోయింది.

దీంతో చిరు వ్యాపారులు శాశ్వత  స్టాల్స్ నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నారు. దీనికి తోడు నగరంలో పలు ప్రాంతాలలో రోడ్డు ఆక్రమణలో భాగంగా తొలగించబడిన చిరు వ్యాపారస్తులు సైతం ఇక్కడ తిష్ట వేయడానికి ఆసక్తి చూపడంతో జేఎన్టీయూ హెచ్ ప్రధాన గేటు నుండి కెపిహెచ్ బి కాలనీ మొదటి రోడ్డు వరకు ఇరువైపుల చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభమయ్యాయి.

బతుకుదెరువు కోసం స్టాల్స్.. ఆపై అద్దె..

మొదట ఈ సర్వీస్ రోడ్ లో కొందరు చిరు వ్యాపారులు తమ బతుకుదెరువు కనికరించమని మొరపెట్టుకున్న వాళ్లే అనంతరం కొందరు స్టాల్స్ ను అద్దెకివ్వడం ప్రారంభించారు. దీంతో ఇక్కడ స్టాల్స్ లేని వ్యాపారులు స్టాల్స్ ను అద్దెకు తీసుకొని అధిక మొత్తంలో అడ్వాన్స్ ఇస్తూ నెల నెలకు అధిక మొత్తంలో అద్దెలు కూడా చెల్లిస్తున్నారు. దీంతో ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు కోసం డిమాండ్ పెరిగింది.

కొందరు చిరు వ్యాపారులు తమ స్టాల్స్ ను అమ్ముకుంటున్నట్టు తెలుస్తుంది ఒక్కొక్క సుమారు రూ.30 లక్షల రూపాయల వరకు అమ్ముకుంటున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారం అంతా స్థానిక నాయకుల సహకారంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక మున్సిపల్, ట్రాఫిక్ అధికారుల అండదండలు కూడా చిరు వ్యాపారులకు తోడు కావడంతో ఇక్కడ చిరు వ్యాపారులను ప్రశ్నించే వారే లేకుండా పోయారు.

గవర్నర్‌కు బీజేపీ నాయకుల ఫిర్యాదు..

కేపీహెచ్‌బీ కాలనీ మొదటి రోడ్డు నుండి జేఎన్టీయూహెచ్ ప్రధాన గేటు వరకు ఉన్న చిరు వ్యాపారుల్లో చాలామంది స్థానికేతరులని వాళ్లతో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని స్థానిక బిజెపి నాయకులు ఈ మధ్యనే  గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అక్రమంగా సర్వీస్ రోడ్డును ఆక్రమించి స్టాల్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ కు స్థానికుల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని బిజెపి నాయకులు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు స్పందించి ఈ సర్వీస్ రోడ్డులో ఏర్పాటు చేసుకున్న స్టాల్స్ ను పూర్తిగా తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో, లేదో.. వేచి చూడాలి.