9 June, 2026 | 2:59 AM

రాష్ట్రాన్ని తాకిన నైరుతి

09-06-2026 12:10 AM
  1. జిల్లాల్లో జోరు వర్షాలు!
  2. రెండు మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వాతావరణం చల్లబడటమే కాకుండా, వర్షాలు కూడా కురుస్తున్నాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో మరింతగా తెలంగాణ అంతటా రుతుపవనాలు పూర్తిగా విస్తరిస్తాయి. రుతుపవనాల రాకతో ముఖ్యంగా దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది.

రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ, మహారాష్ట్రలో 30 శాతం విస్తరించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు బంగళాఖాతంలో పూర్తిగా వ్యాపించినట్లు పేర్కొన్నారు. మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మంగళవారం వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో  అక్కడక్కడ కురువనున్నాయి. బుధవారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహ బూబ్‌నగర్, వరంగల్, హనుమకొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో, గురువారం భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్ జిల్లాల్లో కురుస్తాయి.