05-02-2026 12:00:00 AM
ఎస్పీ మహేష్ బీ గితే
రాజన్న సిరిసిల్ల.వేములవాడ, ఫిబ్రవరి 4 (విజయ క్రాంతి): ఈ నెల 11 వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో చేస్తున్న ఏర్పాట్లను ఎస్పీ మహేష్ బి గితే తో కలిసి బుధవారం పరిశీలించారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ జిల్లా పరిషత్ స్కూల్, వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయనున్న మున్సిపల్ ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం కోసం చేసుకున్న ప్లాన్ ను ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే తో కలిసి పరిశీలించారు.
స్కూల్, కళాశాల ఆవరణల్లో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పలు సూచనలు చేశారు. అలాగే సిరిసిల్ల, వేములవాడ పట్టణంలోని సీ నారాయణరెడ్డి కళా మందిరంలో రిసెప్షన్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రం కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
కౌంటింగ్ హాల్లో భద్రతా ఏర్పాట్లు, సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు, విద్యుత్ సరఫరా, తాగునీరు, తదితర సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వాహనాల పార్కింగ్ కోసం చదును చేస్తున్న స్థలాన్ని సందర్శించారు. కళా మందిరం లోపల స్ట్రాంగ్ రూం, ఓట్ల లెక్కింపు కోసం ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు..
అధికారులు, పోటీలో ఉన్న అభ్యర్థులకు కోసం చేస్తున్న ఏర్పాట్లను సందర్శిచారు. వాహనాల పార్కింగ్, క్రమబద్ధమైన రాకపోకలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. మీడియా సెంటర్ ఏర్పాటుపై సూచనలు చేశారు.పరిశీలనలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, నోడల్ అధికారులు శ్రీనివాసాచారి, ప్రవీణ్, తహసీల్దార్లు మహేష్ కుమార్, జయంత్ కుమార్ తదితరులు ఉన్నారు.