4 August, 2026 | 3:51 AM

గిరిజన గురుకులంలో కలకలం

04-08-2026 01:51 AM
  1. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని కలెక్టరేట్ ఎదుట బైఠాయింపు
  2. వైస్ ప్రిన్సిపాల్‌పై విద్యార్థుల తీవ్ర ఆరోపణలు

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 3(విజయ క్రాంతి):జిల్లా కేంద్రంలోని పీటీజీ (PTG) గిరిజన ఆశ్రమ బాలుర గురుకుల పాఠశాలలో వైస్ ప్రిన్సిపాల్ ప్రవీణ్ బాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ విద్యార్థులు సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, చిన్న చిన్న కారణాలకే విచక్షణారహితంగా కొడుతున్నారని ఆరోపిస్తూ కలెక్టరేట్ ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ విద్యార్థుల మధ్య గ్రూపులు సృష్టించి ఒక గ్రూపును మరో గ్రూపుపై ప్రోత్సహిస్తున్నారని, తనకు నచ్చని విద్యార్థులను అకారణంగా దండిస్తున్నారని, కొందరు విద్యార్థుల ప్రైవేట్ భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారని విద్యార్థులు ఆరోపించారు.

తమపై మానసిక, శారీరక వేధింపులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని, సంబంధిత అధికారుల సమక్షంలో పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. వైస్ ప్రిన్సిపాల్ను కాపాడేందుకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి (డీ సిఓ) రంగంలోకి దిగి ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.

విద్యార్థులు తీవ్రమైన అత్యంత  చేసిన ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది  . ముఖ్యంగా మైనర్ల భద్రత, సంక్షేమానికి సంబంధించిన అంశాలు కావడంతో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిష్పక్షపాత విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఉత్పన్నమవుతుంది.