ఆరోగ్య ‘యోగ’ం.. ఆనంద భాగ్యం!
కామిడి సతీష్‌రెడ్డి :
‘యోగమే ఆరోగ్యానికి మార్గం, యోగ మే ఆనందానికి సారథ్యం!. శరీరానికి శక్తిని నింపి, మనసు కు ప్రశాంతతను అందించి ప్రతి శ్వాసలో నూతన చైతన్యం, ప్రతి ఆసనంలో ఆరోగ్య వైభవం!. ఒత్తిడిని దూరం చేసి, ఆత్మవిశ్వాసాన్ని పెంచి వృద్ధాప్యానికీ వెలుగునిచ్చే దీపం, జీవితానికి సుఖశాంతుల రూపం!. నిత్యం యోగా సాధన చేస్తే, ఆరోగ్యమే మనకు అమూల్య సంపద అవుతుంది!!. నేటి ప్రపం చం వేగవంతమైన జీవనశైలి, తీవ్రమైన పోటీ, మానసిక ఒత్తిళ్లతో నిండి ఉంది.
సాంకేతిక పురోగతి అపూర్వమైన సౌకర్యాలను అందించినప్పటికీ, మానసిక ప్రశాంతతను దూరం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో మానసిక శారీరక ప్రశాంతతకు దివ్య ఔషధం యోగ. వ్యక్తికి శారీరక ఆరోగ్యం, మానసిక స్థైర్యం, భావోద్వేగ సమతుల్యతను అందిస్తుంది. ప్రతి వయస్సులోనూ మరియు వృద్ధాప్యంలో కూడా.
2026 థీమ్.. ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా’
ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యకలాపాలను ఒక అంశం చుట్టూ కేంద్రీకరించడానికి నిర్దిష్ట థీమ్ తీసుకుంటున్నారు. 2026 థీమ్ ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా’. యోగా ద్వారా ప్రతి వయస్సులోనూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. వృద్ధాప్యంలో కూడా చురుకుగా, ఆరోగ్యంగా జీవించేందుకు ప్రోత్సహించడం. నడక, ఈత, కొట్టడం, రన్నింగ్ ఇవన్నీ వ్యాయామం కిందకే వస్తాయి.
వీటి ప్రక్రియలో భాగంగానే యోగాను చూడాలంటున్నారు కొందరు వైద్య ఆరోగ్య నిపు ణులు. క్రీస్తు పూర్వం 100 - 500 శకం మధ్య కాలంలో యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించినట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నా రు. దీనికి ఆద్యుడు పతంజలి. ఒకప్పుడు మానవులు శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు.
ఆధునిక కాలంలో మనుషులు చేసే పనులనే యంత్రాలు చేస్తున్నాయి. దీనితో శారీరక శ్రమ తగ్గింది. ఆహార అలవాట్లు కూడా మారుతున్నాయి. దీంతో వ్యాయామం ఆవశ్యకత పెరిగింది. ఇందుకు వయసును బట్టి వివిధ రకాల వ్యాయామాలు చేయవచ్చు. కాలి నడక, సైకిల్ తొక్కడంతో పాటు.. యోగా కూడా ఒక వ్యాయామమే.
మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం 2015 జూన్ 21న
ప్రపంచవ్యాప్తంగా మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం 2015 జూన్ 21న నిర్వహించారు. భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించారు. ఆ వేడుకలకు చాలా దేశాలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. 84 దేశాల నుంచి వచ్చిన నేతలతో పాటు మొత్తం 35,985 మంది యోగా చేసి రెండు గిన్నిస్ రికార్డులను నెలకొల్పారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం భారతదేశంలో, ప్రపంచంలోని నగరాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
కొన్ని ఆసనాలకు నిపుణుల సలహాలు తప్పనిసరి
యోగా సర్వ రోగనివారిణి అయిన ఏ విధానానికి అయినా కొన్ని పరిమితులు ఉంటాయి. నిపుణుల సలహాలు లేకుండా కొన్ని ఆసనాలు వేయడం ఆరోగ్యరీత్యా అంత మంచిది కాదు. కాబట్టి నిపుణుల సలహాలతోనే యోగాసనాలు వేయాలి. దీనికి మతం, వర్గంతో సంబంధం లేదు. యోగా ప్రాచీన భారతీయ వారసత్వ సంపద. కాలంతో పాటు ఏ విధానంలో నైనా మార్పులు వస్తాయి. యోగాలో కూడా మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఫిజియో థెరపీ బాగా అభివృద్ధి చెందింది. యోగాను కూడా ఇందులో భాగం చేసుకొని ఆచరించవచ్చు. యోగ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం.






