25 July, 2026 | 3:20 AM

తెలంగాణకు పెండింగ్ కేంద్ర నిధుల విడుదలకు కృషి

25-07-2026 02:45 AM

కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే

ముషీరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): తెలంగాణకు రావాల్సిన పెండింగ్ కేంద్ర నిధులను విడతల వారీగా విడుదల చేయడంతో పాటు, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే తొలి విడత నిధుల కేటాయింపునకు చర్యలు తీసుకుంటామని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే హామీ ఇచ్చారు.

రాష్ట్ర పర్యటనలో భాగంగా సామాజిక సంక్షేమం, అభివృద్ధి అంశాలపై శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల్లో తొలి విడతగా రూ.150 కోట్ల విడుదలకు కృషి చేస్తామని, అదేవిధంగా రూ.300 కోట్ల ప్రత్యేక ప్యాకేజీపై వచ్చే నెలలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. షెడ్యూల్ కులాల విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల మెరుగుదల, సంక్షేమ విద్యాసంస్థల ఆధునీకరణ, కేంద్ర ప్రాయోజిత పథకాల సమర్థ అమలుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని అథవాలే స్పష్టం చేశారు.

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సంబంధించిన నిధుల కేటాయింపుపై సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి, సామాజిక న్యాయం, భావితరాల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇన్చార్జి, జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ ఎస్సీ విద్యార్థుల సంక్షేమం, కేంద్ర పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో టి.రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.