ఆగని అన్నదాతల ఆగ్రహం
- దాన్యం కుప్పలకు నిప్పు పెట్టిన రైతులు
- కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గుతున్న ధాన్యం
- భగ్గు మంటున్న రైతులు మారని అధికారుల తీరు
కామారెడ్డి, మే 20 (విజయక్రాంతి): అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. అయినా అధికారుల లో మార్పు రావడం లేదు. ధాన్యం రాశులు కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. నెల రోజులకు పైగా కొనుగోలు కేంద్రాల్లోని రైతులు ధాన్యం కుప్పలతో అవస్థలు పడుతున్నారు. అధికారులకు కొనుగోలు సెంటర్ల నిర్వాహకులకు రైతన్నలు తమ గోడును వెళ్ళ బోస్తున్న అధికారుల్లో మార్పు రావడం లేదు. ధాన్యం కాంట ఎప్పుడు అవుతుందని ఎదురుచూపులు చూస్తున్న రైతుల కు అగ్రహాo కట్టలు తెంచుకుంటుంది.
నెల గడిచినా కూడా కొనుగోలు చేపట్టకపోవడం, దాన్యం కాంట చేసిన రైస్ మిల్ కు తరలించకపోవడం లారీల కొరతను అధికారులు సాకు చూపెడుతున్నారు. రైస్ మిల్లుల వద్ద లారీలు అన్లోడ్ చేయడం లేదని హమాలీల కొరత వేధిస్తుందని లారీల యజమానులు వాపోతున్నారు. మరో పక్క గన్ని బ్యాగుల కొరత కొనుగోలు కేంద్రాల్లో నేలకొనడంతో రైతులు అన్ని రకాలుగా అవస్థలు పడుతున్నారు. రాత్రి వేళలో కొనుగోలు కేంద్రాల్లో కరెంటు లేకుండా చీకట్లో ఉండాల్సి వస్తుంది. ధాన్యం రాశులను పెట్టుకొని కొనుగోలు కేంద్రాల్లో సమస్య ల మధ్య సతమతమవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం తెచ్చి నలభై రోజులు అయినా కాంటా పెట్టని వైనం
రెండు రోజుల క్రితం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లిలో 40 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ధాన్యాన్ని కాంటా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధాన్యం కుప్ప లకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేసిన ఘటన మరువకముందే రామారెడ్డి మండలం గోకుల్ తండాలో మంగళవారం రాత్రి దాన్యం బస్తాలకు కొనుగోలు కేంద్రంలో రైతులు నిప్పు పెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు.
ధాన్యం కుప్పలతో రైతుల ఎదురుచూపులు
అధికారుల ఆల సత్వం వల్ల కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం రాశులను పెట్టుకొని ఎదురుచూపులు చూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు చెప్పిన మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు తప్ప ఆచరణలో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదని రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చిన రెండు మూడు రోజుల్లోనే ధాన్యాన్ని కాంటా పెట్టి రైస్ మిల్ కు తరలించి అన్లోడ్ చేయించాలని రైతులు కోరుతున్నారు.
నాలుగు రోజుల్లో రెండు చోట్ల ధాన్యం కుప్పలకు నిప్పు పెట్టిన రైతులు
నాలుగు రోజుల్లోనే రెండు గ్రామాల్లో రైతులు ప్రభుత్వ అధికారుల తీరును నిరసిస్తూ ధాన్యము కుప్పలకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజమ్మ తండా కు చెందిన లేగల నరేష్ అనే రైతు తన ధాన్యం బస్తాలకు మంగళవారం రాత్రి నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు సకాలంలో చేపట్టకపోవడంతో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం మగ్గిపోవడంతో విసుకు చెందిన కొందరు రైతులు ధాన్యం కుప్పలకు నిప్పు పెడుతున్నారు.
ఇకనైనా అధికారులు మేల్కొనాలి
ధాన్యం కుప్పలతో రాశులు పోసుకొని అవస్థలు పడుతున్న రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కాంటా పెట్టి ధాన్యాన్ని లారీల ద్వారా రైస్ మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా లేదో వేచి చూడాల్సిందే. కామారెడ్డి ఆర్డీవో రాజమ్మ తండా చేరుకుని. ధాన్యాన్ని వెంటనే కాంటా చేయించి రైస్ మిల్లులకు తరలిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందవద్దని లారీల కొరత, హమాలీల కొరత వల్ల కొన్నిచోట్ల ధాన్యం కాంట పెట్టడంలో, ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడంలో ఆలస్యం జరుగుతుందని రైతులు ఆందోళనకు గురి కావద్దని తెలిపారు.
వారం రోజుల్లో దాన్యం మొత్తం రైస్ మిల్లులకు తరలిస్తామని రైతులు ఇబ్బందులు పడవద్దని ఆర్డిఓ గిరి రైతులకు హామీ ఇచ్చారు. ఇటీవల కలెక్టర్ సైతం పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు, బుధవారం రైస్ మిల్లులను సైతం పరిశీలించి రైస్ మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని ఆన్ లోడ్ చేయడంలో జరుగుతున్న జాప్యంపై రైస్ మిల్లు యజమాలతో అధికారులతో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురా వాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రైస్ మిల్లర్లకు కూడా ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా కల్పించారు.






