19 August, 2026 | 1:03 AM

అగమ్యగోచరంగా రైతన్న స్థితి!?

19-08-2026 12:00 AM
  1. అడుగడుగునా మోసపోతున్న రైతులు
  2. ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా ఆగని అక్రమాలు
  3. విత్తనాల నుంచి ఎరువుల వరకు రైతులకు తప్పని మోసాల బెడద

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి):దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అన్నదాతలు అడుగడుగునా మోసాలకు గురవుతున్నారు. విత్తనాల కొనుగోలు నుంచి పంటను విక్రయించే వరకు రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నకిలీ విత్తనాలు, అక్రమ ఎరువుల విక్రయాలను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడుతు న్నప్పటికీ కొంతమంది అక్రమార్కులు కొత్త మార్గాల్లో రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

యాప్ ఉన్నా.. మోసాలు ఆగడం లేదు...

రైతులకు విత్తనాలు, ఎరువులు సక్రమంగా అందించడంతో పాటు అక్రమ విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రైతు ఆధార్ వివరాలతో ఎరువుల కొనుగోలును నమోదు చేసే విధానం ద్వారా పారదర్శకత తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఇదే విధానాన్ని కొంతమంది వ్యాపారులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.రైతు తనకు అవసరమైన ఎరువులు మాత్రమే కొనుగోలు చేసినప్పటికీ, అతని ఆధార్ వివరాలతో ఇతర ఎరువుల బస్తాలను కూడా కొనుగోలు చేసినట్లు నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

దీంతో రైతు కోటాలో ఇతర ఎరువులు విక్రయమైనట్లు ఆన్లైన్లో నమోదవుతుండటంతో, తర్వాత ఆ ఎరువులు అవసరమైన సమయంలో రైతుకు అవి అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాప్ కొన్ని మొబైల్స్ లో యాక్సిస్ కాకపోవడంతో వ్యాపారులకు కలిసి వస్తుంది.

రైతు యొక్క వివరాలు నమోదు చేస్తే అతనికి ఎంత భూమి ఉంది ఎన్ని ఎరువు బస్తాలు ఇవ్వచ్చనే సమాచారం రావడంతో అక్రమార్కులకు పండగ అవుతుంది. కొంతమంది రైతుల కు 5 బస్తాల యూరియా అవసరముండగా 10 బస్తాలు కొనుగోలు చేసినట్లుగా చూపించి మిగతా ఐదు బస్తాలను అధిక ధరలకు అక్రమంగా ఇతరులకు అమ్ముతున్నట్లు సమాచారం. యాప్ అన్ని మొబైల్స్ కి యాక్సిస్ అయ్యే విధంగా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతుల కోరుతున్నారు.

యూరియా అడిగితే.. పొటాష్ కూడా కొనేసినట్లు!

రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ఓ ఎరువుల దుకాణానికి వెళ్లిన ఓ రైతు యూరియా బస్తాలు కావాలని కోరినట్లు సమాచారం. అయితే సదరు వ్యాపారి యూరియాతో పాటు పొటాష్ బస్తాలు కూడా కొనుగోలు చేసినట్లు నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. చదువుకున్న రైతు కావడంతో తన మొబైల్కు వచ్చిన ఎస్‌ఎంఎస్ను పరిశీలించగా, తాను కొనుగోలు చేయని ఎరువులు కూడా తన పేరుతో నమోదైన విషయం గుర్తించినట్లు తెలిసింది.ఇలాంటి ఘటనలు చదువుకోని రైతుల విషయంలో జరిగితే వారికి విషయం తెలియకపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల పేర్లపై నమోదు చేసిన అదనపు ఎరువులను కొందరు వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

నకిలీ విత్తనాల నుంచి ఎరువుల అక్రమాల వరకు....

జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల విక్రయాలపై అధికారులు చర్యలు తీసుకున్న సందర్భాలున్నప్పటికీ నకిలీ విత్తనాలను అక్రమార్కులు అమాయక రైతులకు అంటగట్టిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో తాజాగా ఎరువుల విక్రయాల్లోనూ అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు రావడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. పెట్టుబడులు పెట్టి పంట సాగు చేస్తున్న రైతులు నకిలీ విత్తనాలు, నాసిరకం ఇన్పుట్లు, అధిక ధరలు, ఎరువుల అక్రమ విక్రయాల కారణంగా ఆర్థికంగా నష్టపోతున్నారు.

అధికారులు పర్యవేక్షణ పెంచాలి.....

రైతుల ఆధార్తో ఎరువుల కొనుగోలు నమోదు చేసే విధానాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. రైతు నిజంగా కొనుగోలు చేసిన ఎరువులు, అతని పేరుతో ఆన్లైన్లో నమోదైన ఎరువులు సరిపోతున్నాయా లేదా అనే అంశంపై తనిఖీలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎరువుల దుకాణాల్లో సీసీ కెమెరాల పరిశీలన, స్టాక్ రిజిస్టర్ల తనిఖీ, రైతులకు వచ్చిన ఎస్‌ఎంఎస్ల ఆధారంగా విచారణ చేపడితే అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని అభిప్రాయపడుతున్నారుఅన్నదాతను మోసం చేసే అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుని, రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.