దోమలు బాబోయ్.. దోమలు!
- ఆరు దాటితే దోమల దండయాత్ర
- బ్లీచింగ్ నామమాత్రం.. ఫాగింగ్ ఊసే లేదు
- పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం.. పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
- దోమల బెడదతో ప్రజల అవస్థలు
బూర్గంపాడు, ఆగస్టు18, (విజయక్రాంతి): సాయంత్రం ఆరు గంటలు దాటితే చాలు.. దోమల దండయాత్ర మొదలవుతోంది. ఇంటి బయట కాసేపు కూర్చోవాలన్నా.. రాత్రివేళ ప్రశాంతంగా నిద్రపోవాలన్నా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దోమల నియంత్రణకు చేపట్టాల్సిన ఫాగింగ్ కార్యక్రమం కనిపించకపోవడం, బ్లీచింగ్ ప్రక్రియ కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో సమస్య మరింత తీవ్రమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పారిశుద్ధ్యం ఎక్కడ?
గ్రామంలోని పలు ప్రాంతాల్లో మురుగు కాలువలు, ఖాళీ ప్రదేశాలు, నీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉన్నప్పటికీ తగిన చర్యలు కనిపించడం లేదని ప్రజలు అంటున్నారు. దోమల ఉత్పత్తికి అనుకూలంగా మారుతున్న ప్రాంతాలను గుర్తించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాల్సి ఉన్నా.. సంబంధిత సిబ్బంది పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఫాగింగ్.. మరిచిపోయారా?
దోమల బెడద నివారణకు ఫాగింగ్ నిర్వహించాలని ప్రజలు కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని స్థానికులు చెబుతున్నారు. సాయంత్రం వేళల్లో దోమల తీవ్రత అధికంగా ఉంటోందని.. అయినా ఫాగింగ్ యంత్రం మాత్రం కనిపించడం లేదని వాపోతున్నారు.
బ్లీచింగ్ కూడా అంతంతే
బ్లీచింగ్ పౌడర్ చల్లే విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నామమాత్రంగా బ్లీచింగ్ చేస్తున్నారని, సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు మాత్రం సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రజాప్రతినిధులు.. అధికారులు స్పందించాలి
దోమల బెడదపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాకాలంలో దోమల ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఇప్పటికైనా అధికారులు మేల్కొని ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహించడం, మురుగు కాలువలను శుభ్రం చేయడం, నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంతో పాటు బ్లీచింగ్ విస్తృతంగా చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






