వనపర్తి కాంగ్రెస్‌లో బహిరంగ యుద్ధం
- టికెట్ చిచ్చు రగిల్చిన రచ్చ
- 2023 టికెట్ మార్పు.. అప్పటి అసంతృప్తి ఇప్పుడు బహిరంగ ఆరోపణలుగా మారిందా?
- చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి.. అధిష్టానం నిర్ణయం నాటి పంచాయితీ మళ్లీ తెరపైకి
వనపర్తి, ఆగస్టు 18 (విజయక్రాంతి): వనపర్తి కాంగ్రెస్లో ప్రస్తుతం కనిపిస్తున్న బహిరంగ యుద్ధానికి అసలు బీజం ఎక్కడ పడింది? సీనియర్ నేత ప్రస్తుత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షలు జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య తాజాగా చోటుచేసుకున్న మాటల యుద్ధం వెనుక 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన టికెట్ మార్పే ప్రధాన కారణమా? ఇప్పుడు వనపర్తి రాజకీయాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది.
ఇన్నాళ్లు కాంగ్రెస్లో అంతర్గతంగా ఉన్న అసంతృప్తి తాజాగా వీడియోల రూ పంలో బయటకు రావడంతో వివాదం ఒక్కసారిగా బహిరంగమైంది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తామని ప్రకటించడం, సస్పెన్షన్ డిమాండ్ వరకు వ్యవహారం వెళ్లడం.. వనపర్తి కాంగ్రెస్లో పరిస్థితి ఏ స్థాయికి చేరిందో స్పష్టం చేస్తోంది.
టికెట్ ఎవరిది.. చివరికి ఎవరికి?
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థిత్వం కీలకంగా మారింది. సీనియర్ నాయకుడు చిన్నారెడ్డికి మొదట టికెట్ కేటాయించినప్పటికీ, అనంతరం అభ్యర్థిత్వాన్ని మార్చి తూడి మేఘారెడి ్డని బరిలోకి దించారు. ఈ మార్పు అప్పట్లోనే రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
మేఘారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి వి జయం సాధించడంతో ఆయన రాజకీయం గా బలమైన స్థానాన్ని సంపాదించారు. మ రోవైపు చిన్నారెడ్డి మాత్రం పార్టీతోనే కొనసాగుతూ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు. బయటకు విభేదాలు పెద్దగా కనిపించకపోయినా.. టికెట్ మార్పు వ్యవహారం అంతర్గతంగా మాత్రం పూర్తిగా సమసిపోలేదన్న చర్చ కొనసాగింది.
నా టికెట్ ఎందుకు మార్చారు?
తాజాగా గోపాల్పేటలో కాంగ్రెస్ నాయకులతో చిన్నారెడ్డి మాట్లాడినట్లు ఉన్న వీడి యోలు బయటకు రావడంతో పాత వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. తనకు తొలుత టికెట్ కేటాయించి, చివరి నిమిషంలో మా ర్చారని చిన్నారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు వీడియోలోని వ్యాఖ్యలు చెబుతున్నా యి.
డబ్బులకు ఆశపడి తన టికెట్ మార్చారని, తన సుదీర్ఘ రాజకీయ జీవితానికి తీవ్ర నష్టం జరిగిందని ఆయన ఆరోపించినట్లు తెలుస్తోంది. తనకు టికెట్ ఇచ్చి ఉంటే తానే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉండేవాడినని, వనపర్తి అభివృద్ధికి మరింత కృషి చేసేవాడినని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇక్కడే అసలు చిచ్చు మరోసారి రాజుకుంది.
టికెట్ మార్పు వెనుక డబ్బులా?
చిన్నారెడ్డి చేసినట్లు ప్రచారంలో ఉన్న వ్యాఖ్యల్లో మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు బయటకు రావడం తో టికెట్ మార్పు వెనుక అసలు కారణాలపై మరోసారి చర్చ మొదలైంది. అయితే ఈ ఆరోపణలను మేఘారెడ్డి తీవ్రంగా ఖం డించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా చిన్నారెడ్డి అనేకసార్లు పార్టీ టిక్పె పోటీ చేశారని.. గుర్తుచేస్తూ.. మీరు కూడా టికెట్లు డబ్బు లు ఇచ్చి తెచ్చుకున్నారా? అంటూ ప్రశ్నించారు.
టికెట్ చిచ్చు.. ఇప్పుడు పార్టీ పంచాయితీ
టికెట్ మార్పుతో మొదలైన అసంతృప్తి ఇప్పుడు వ్యక్తిగత విమర్శలను దాటి పార్టీ అంతర్గత వ్యవహారంగా మారింది. చిన్నారెడ్డి బీఆర్‌ఎస్ నాయకుల కోసం పనిచేస్తున్నారని మేఘారెడ్డి ఆరోపించగా, తనపై చేస్తున్న విమర్శలను చిన్నారెడ్డి వర్గం తీవ్రంగా ఖండిస్తోంది. మరోవైపు పార్టీ క్రమశిక్షణ అంశం కూడా తెరపైకి వచ్చింది.
చిన్నారెడ్డిపై ఏఐసీసీ, టీపీసీసీ, క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు మేఘారెడ్డి ప్రకటించారు. వారం రోజుల్లో చర్యలు లేకపోతే గాంధీభవన్ ముట్టడిస్తామని ఆయన చేసిన హెచ్చరిక వివాదాన్ని మరింత వేడెక్కించింది. చెప్పిన విధంగానే ఎమ్మెల్యే మేఘారెడ్డి మంగళవారం పిర్యాదుతో కూడిన లెటర్ ను క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ ఎం పి మల్లు రవి కి అందచేశారు.
అసలు చిచ్చు.. ఇప్పుడు ఎటు?
2023లో టికెట్ మార్పుతో మొదలైన అసంతృప్తి.. తాజాగా వీడియోలతో బహిర్గతమై బహిరంగ యుద్ధంగా మారింది. టికెట్ వ్యవహారం నుంచి మొదలైన వివాదం ఇప్పుడు డబ్బుల ఆరోపణలు, పార్టీ క్రమశిక్షణ, బీఆర్‌ఎస్తో సంబంధాల ఆరోపణల వరకు వెళ్లింది.
కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా ఇరువర్గాల మధ్య విభేదాలను పరిష్కరించకపోతే, ఈ పంచాయితీ మరింత ముదిరే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వనపర్తి కాంగ్రెస్లో రగిలిన ఈ చిచ్చు ఎక్కడ ఆగుతుంది? టికెట్ నాటి అసంతృప్తికి పార్టీ అధిష్టానం ముగింపు పలుకుతుందా? లేక బహిరంగ యుద్ధం మరింత ముదురుతుందా? అనేది వనపర్తి కాంగ్రెస్కే కాదు జిల్లా రాజకీయాలకూ కీలక ప్రశ్నగా మారింది.






