యాప్‌లో బుక్.. స్టాల్‌లో నో స్టాక్?
- రంగంపేట మన గ్రోమోర్ వద్ద రైతుల ఆందోళన
- 50 మంది రైతులు.. 200 బస్తాల యూరియా బుకింగ్.. అయినా దక్కని ఎరువు
- సాంకేతిక లోపాలే కారణమంటున్న అధికారులు
- పొంతనలేని సమాధానాలపై రైతుల ఆగ్రహం
కొల్చారం, ఆగస్టు 18: యూరియా పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ రైతులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. యాప్లో యూరియా బుక్ చేసుకున్నా కొనుగోలు కేంద్రానికి వెళ్లేసరికి స్టాక్ లేదని తెలియడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రంగంపేటలోని మన గ్రోమోర్ సెంటర్ వద్ద సుమారు 50 మంది రైతులు ఆందోళనకు దిగారు.
రంగంపేట, సంగారెడ్డి గ్రామాలకు చెందిన రైతులు సోమవారం ఉదయం 8.30 నుంచి 8.40 గంటల మధ్య ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్లో సుమారు 200 బస్తాల యూరియాను బుక్ చేసుకున్నారు. బుధవారం యూరియా అందజేస్తామని రైతుల మొబైల్ ఫోన్లకు సందేశాలు రావడంతో వారు నిర్ణీత సమయానికి మన గ్రోమోర్ సెంటర్కు చేరుకున్నారు. అయితే అక్కడ యూరియా స్టాక్ లేదని నిర్వాహకులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుక్ చేసిన యూరియా ఏమైంది?
సుమారు 50 మంది రైతులకు 200 బస్తాల వరకు యూరియా బుక్ అయినట్లు యాప్లో చూపించినప్పటికీ కేంద్రంలో స్టాక్ లేకపోవడంపై రైతులు నిర్వాహకులను నిలదీశారు. యూరియా ఎవరికి విక్రయించారని ప్రశ్నిస్తూ వాగ్వాదానికి దిగారు. స్టాక్ లేనప్పుడు యాప్లో యూరియా అందుబాటులో ఉన్నట్లు ఎలా చూపిస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాంకేతిక లోపమేనంటున్న అధికారులు..
నూతన ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్లో సాంకేతిక సమస్యల కారణంగా గత నాలుగైదు రోజులుగా చేగుంట, చిన్న ఘనపూర్, కొంగోడు తదితర ప్రాంతాల్లోనూ ఇలాంటి సమస్యలు తలెత్తాయని వ్యవసాయ అధికారులు రైతులకు వివరించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నివేదిక సమర్పించినట్లు తెలిపారు. అయితే స్టాక్ లేకుండానే యాప్లో బుకింగ్ ఎలా సాధ్యమవుతుందో చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు.
పొంతనలేని సమాధానాలు..
ఈ విషయమై కొల్చారం వ్యవసాయ అధికారి శ్వేతాకుమారి, జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్లను వివరణ కోరగా.. ఆన్లైన్లో బుక్ చేసుకున్న రైతులు యూరియా డెలివరీ అయిన తర్వాత యాప్లోకి వెళ్లి బుకింగ్ను క్యాన్సిల్ చేయడంతో స్టాక్ తిరిగి కనిపిస్తుందని, దీంతో అదనంగా బుకింగ్ అయినట్లు చూపించే అవకాశం ఉందని సమాధానం ఇచ్చారు. అయితే సోమవారం ఉదయం 8.30 నుంచి 8.40 గంటల వరకు కేవలం పది నిమిషాల వ్యవధిలోనే మన గ్రోమోర్ సెంటర్కు సంబంధించిన యూరియా బుకింగ్ జరిగినప్పుడు..
ఆ పది నిమిషాల్లోనే రైతు యూరియా కొనుగోలు చేసి, అనంతరం యాప్లోకి వెళ్లి బుకింగ్ను ఎలా క్యాన్సల్ చేస్తాడని రైతులు ప్రశ్నించారు. దీంతో అధికారుల సమాధానాలపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్లోని సాంకేతిక లోపాలను తక్షణమే సరిచేయాలని రైతులు కోరుతున్నారు. స్టాక్ వివరాలు, బుకింగ్, కేటాయింపు ప్రక్రియలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుని.. రైతులకు సులభంగా యూరియా అందేలా వ్యవస్థను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు.






