సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి,(విజయ క్రాంతి): బహుజన రాజ్య స్థాపన, సామాజిక న్యాయం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక అసమానతలు, దోపిడీ, భూస్వామ్య, పెత్తందారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా 17వ శతాబ్దంలోనే పాపన్న గౌడ్ ధైర్యంగా పోరాడారని కొనియాడారు. ఎల్లమ్మ దేవాలయం ఏర్పాటుకు కూడా కృషి చేస్తామని తెలిపారు.
కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం పాపన్న గౌడ్ చేసిన కృషి నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. యువత ఆయన జీవిత చరిత్రను తెలుసుకుని పోరాట పటిమ, నాయకత్వ లక్షణాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.






