28 June, 2026 | 1:18 AM

ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ 750 అడుగులే

28-06-2026 12:15 AM
  1. ఇళ్ల ముందు మూడు.. చుట్టూ ఒక అడుగే బయటికి  
  2. మొదటి విడతలో రూఫ్‌లెవల్ ఉన్న ఇళ్లకూ వర్తింపు 
  3. గృహ నిర్మాణ శాఖ ఉత్తర్వులు జారీ
  4. కొత్త నిబంధనలపై లబ్ధిదారులకు అవగాహన

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ విస్తీర్ణంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ ఇక నుంచి ఇష్టం వచ్చిన సైజులో నిర్మించడానికి వీలులేదు. స్లాబ్ ఎంత విస్తీర్ణంలో ఉం డాలో ప్రభుత్వం విధివిధినాలు వెల్లడించింది. ఇందిరమ్మ ఇళ్ల స్లాబు 750 అడుగులకు మించరాదని గృహ నిర్మాణ శాఖ స్పష్టం చేసింది. ముందు వైపు 3 అడుగులు, మిగతా వైపు ఒక అడుగు మాత్రమే ముందుకు రావాలని తెలిపింది.

ఇంట్లోకి ఎండ, వర్షం రాకుండా అవసరమైతే సజ్జలు నిర్మించుకోవాలని సూచించింది. స్లాబ్ ఎక్కువ వేసి ఖర్చు పెరగడంతో లబ్ధిదారులు అనవసర అప్పులు చేస్తున్నట్లు గుర్తించి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు గృహ నిర్మాణ శాఖ వెల్లడించింది. ఉదాహరణకు 400 చదరపు అడుగుల ఇంటికి 500 అడుగుల వరకు, 600 ఎస్‌ఎఫ్టీ ఇంటికి 750 అడుగుల వరకు మాత్రమే స్లాబు ఉండాలని పరిమితి విధించింది.

ఇంటిలోపలికి ఎండ, వాన రాకుండా ఉండేందుకు స్లాబు పెంచడానికి బదులుగా తలుపులు, కిటికీల పైన సజ్జలు, సన్‌షెడ్‌లు  నిర్మించేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని హౌసింగ్ కార్పొరేషన్ అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఎండ రాకుండా ఆర్సీసీ స్లాబు పెంచే బదులుగా అవసరమైతే రేకులు వేసుకునేలా లబ్ధిదారులకు వివరించాలని పేర్కొంది. కొత్త వాటితోపాటు ప్రస్తుతం బేస్‌మెంట్, రూఫ్ లెవెల్లో ఉన్న నిర్మాణాలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి వీపీ గౌతమ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇళ్లను మధ్యలో ఆపేస్తున్నారనే..

ఇప్పటికే సుమారు లక్ష ఇందిరమ్మ ఇళ్లు పూర్తి కాగా, మరో లక్ష ఇళ్లు ఈ సెప్టెంబర్ నాటికి పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు రెండో విడత ఇళ్ల కేటాయింపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్థలం ఉన్న వారు ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.5 లక్షలు మంజూరు చేస్తోంది. అయితే ఖర్చు ఎక్కువవుతోందని కొందరు మధ్యలో నిర్మాణాలు ఆపడం, మరికొందరు ప్రారంభించక పోవడాన్ని గుర్తించిన హౌసింగ్ కార్పొరేషన్ వ్యయంపై అధ్యయనం చేసింది.

చాలామంది స్లాబ్ ఎక్కువ సైజులో నిర్మిస్తున్నట్లు గుర్తించింది. కొంతమంది గోడల కన్నా సుమారు 8 అడుగుల వరకు ముందుకొస్తున్నట్లు హౌసింగ్ అధికారులు తెలిపారు. పెద్ద స్లాబు నిర్మించడం వల్ల ఖర్చు పెరిగి, కొందరు లబ్ధిదారులు అప్పులు చేయాల్సి వచ్చి నిర్మాణాన్ని మధ్యలో నిలిపివేస్తున్నట్లు గుర్తించారు. దానివల్ల పేదలు ఇళ్లు నిర్మాణం కోసం సబ్సిడీ నిధులు ఇచ్చే ప్రధాన లక్ష్యమే దెబ్బతింటోందని ప్రభుత్వం పేర్కొంది.

వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని స్లాబ్ విస్తీర్ణంపై పరిమితులు విధించాలని హౌసింగ్ కార్పొరేషన్ కోరడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా విధించిన నిబంధనలను కొత్తగా నిర్మించే ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇప్పుడు మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ సిబ్బంది విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించింది.