28 June, 2026 | 2:36 AM

బీజేపీ చేతిలో శ్రీరాముడూ బాధితుడే

28-06-2026 01:15 AM
  1. దేవుడిపై సొమ్ములనూ వదలడం లేదు
  2. టీ పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): దేశ ప్రజలకు అయోధ్య రాముడంటే ఓ నమ్మకం అని అలాంటి నమ్మకాన్ని బీజేపీ వమ్ము చేసిందని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి విర్శించారు. బీజేపీలో ఉన్న ఏ ఒక్కరూ అసలైన హిందువు కాదని, అంతా డూప్లికేట్  హిందువులేనని విమర్శించారు. అయోధ్య రామ మందిరం హుండీలో డబ్బులు, వెండి ఇటుకలు, ఇతర బంగారు ఆభరణాలు దొంగిలించింది బీజేపీ నాయకులేనని, చివరకు రాముడి ఒంటి మీది సొమ్ములను కూడా బీజేపీ నాయకులు అమ్ముకున్నారని రామ్మోహన్‌రెడ్డి  ధ్వజమెత్తారు. శనివారం సామ రామ్మోహన్ రెడ్డి గాంధీ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

బీజేపీ చేతిలో చివరికి అయోధ్య రాముడు కూడా బాధితుడిలా మిగిలిపోయాడన్నారు. వజ్రాలహారం నుంచి పాదరక్షల దాకా దోచుకున్నారని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి మాత్రం నామమాత్రంగా ముగ్గురితో కూడిన సిట్ వేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఉద్యోగులను అరెస్టు చేసి బలిపశువులను చేశారని మండిపడ్డారు. ఈ కేసులోనూ శబరిమల, తిరుపతి కేసుల్లో జరిగినట్లు సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ దొంగతనానికి పూర్తి బాధ్యత ప్రధానమంత్రి వహించాలని సామ రామ్మోహన రెడ్డి డిమాండ్ చేశారు.