28 June, 2026 | 1:32 AM

నల్లమల అడవిలో 42 పులులు

28-06-2026 12:30 AM

ఏఐటీఈ 2026 ప్రాథమిక నివేదిక వెల్లడి

నాగర్‌కర్నూల్, జూన్ 27 (విజయక్రాంతి): నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 42 పెద్ద పులులు ఉన్నట్లు అఖిల భారత పులుల అంచనా ఏఐటీఈ2026 నివేదిక విడుదల చేసింది. గతేడాది నవంబర్ నుంచి ఎనిమిది నెలల పాటు నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 42 పులులు ఉన్నట్లు ప్రాథమిక నివేదిక చెబుతోందని జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్ చంద్ర తెలిపారు.

2,611 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను రెండు చదరపు కిలోమీటర్ల గ్రిడ్‌లుగా విభజించి, 1,120 ప్రాంతాల్లో 2,240 కెమె రా ట్రాప్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాలుగు బ్లాక్లుగా విభజించి, ప్రతి బ్లాక్‌లో 30 రోజుల పాటు కెమెరా ట్రాప్ల ద్వారా పులుల కదలికలను నమోదు చేశామన్నారు. ఈ ప్రాథమిక విశ్లేషణలో 18 వయోజన ఆడ పులులు, 14 వయోజన మగ పులులు, రెం డు సబ్ అడల్ట్ పులులు, ఎనిమిది పులి పిల్లలను గుర్తించామన్నారు.

పులి పిల్లలు, సబ్ అడల్ట్ పులుల ఉనికి రిజర్వ్‌లో పులుల సంతానో త్పత్తి విజయవంతంగా కొనసాగుతోందని, పులు ల జనాభా స్థిరంగా పెరుగుతోందన్నారు. ఈ సర్వే ను అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ డా. సునీల్ ఎస్ హిరేమత్ (ఐఎఫ్‌ఎస్), నాగర్ కర్నూల్ జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర (ఐఎఫ్‌ఎస్) పర్యవేక్షించారు.

అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, జీవశాస్త్ర నిపుణులు, హైటికోస్ పరిశోధనా బృం దం జాతీయ పులుల సంరక్షణ అథారిటీ (ఎన్టీసీఏ ) మార్గదర్శకాల మేరకు ఈ సర్వేను నిర్వహించినట్లు తెలిపారు. ఈ సర్వే ద్వారా పులుల సంఖ్య, వాటి విస్తరణ, ఆహార జీవుల లభ్యత, ఆవాస పరిస్థితులపై శాస్త్రీయ సమాచారం సేకరించబడిందన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంరక్షణకు అటవీ శాఖ చేపడుతున్న చర్యలే ఇందుకు నిదర్శనమన్నారు.