షాక్ అబ్జర్వర్లను తొలగించ లేదు
- సంక్షోభంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది
- రాహుల్‌వి నిరాధారమైన వ్యాఖ్యలు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో షాక్ అబ్జర్వర్లను (ఆటంకపరిచే వ్యవస్థలు) తొలగించిందని, దీని వల్ల ఆర్థిక సునామీ వస్తుందని రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ఖండించారు. ఆయన వ్యాఖ్యలు నిరాధారమైనవని, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చేసినవని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల అనేక రకాల సవాళ్లు ఎదురవుతున్నాయని, ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయని, భౌగోళికంగా రాజకీయ అనిశ్చితి ఉందని..
అయినా భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా కొనసాగుతుందన్నారు. దశాబ్ద కాలంలో మోదీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేశారని తెలిపారు. ఏప్రిల్ 2026లో ఈవే బిల్లుల జారీ 11.8 శాతం ఉండగా, మే నెల నాటికి 12.9 శాతానికి వృద్ధి చెందిందన్నారు. తయారీ రంగం పీఎంఐ ఏప్రిల్‌లో 54.7 వద్ద స్థిరంగా కొనసాగి, మే నెలలో 56.6కు మెరుగుపడిందన్నారు. ప్రపంచ దేశాల్లో సేవల రంగం భారీగా పతనమైనా భారత్‌లో మరింత బలంగా ఉందని వివరించారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వాహన అమ్మకాలు పెరిగాయని చెప్పారు. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతం వద్ద అదుపులో ఉందని, ఇది ఆర్బీఐ నిర్దేశించిన 4 శాతం లక్ష్యం కంటే తక్కువ అని స్పష్టం చేశారు. ఏప్రిల్ చివరి నాటికి బియ్యం, గోధుమల బఫర్ నిల్వలు 817.53 లక్షల టన్నులుగా ఉన్నాయని, ఇవి బలమైన దేశ ఆహార భద్రతా కవచాన్ని అందిస్తున్నాయని తెలిపారు. నాడు షాక్ అబ్జర్వర్లను తొలగించింది కాంగ్రెస్సేనని రాహుల్ తెలుసుకోవాలని హితవు పలికారు.
యూపీఏ హయాంలో 2013 నాటిదే అసలైన ఆర్థిక సునామీ అని పేర్కొన్నారు. అప్పట్లో రూపాయి విలువ 36 శాతం పడిపోయిందని, విదేశీ మారక నిల్వలు తగ్గాయని, దిగుమతులు ప్రమాదస్థాయికి పడిపోయాయని గుర్తు చేశారు. కేంద్రం ఏ రకమైన షాక్ అబ్జర్వర్లను తొలగించలేదని, దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తించడం, ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం తగదన్నారు. రాహుల్‌గాంధీకి వాస్తవాలపై ఆసక్తి లేదని, తన పార్టీ వరుసగా ఎన్నికల్లో ఎందుకు విఫలమవుతుందో దేశ ప్రజలకు వివరించలేక భయాన్ని, గందరగోళాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు.






