28 July, 2026 | 7:33 PM

ఆగస్ట్ 10న జైల్ భరో విజయవంతం చేయండి: రేపాకుల శ్రీనివాస్

28-07-2026 06:48 PM

దమ్మపేట,(విజయక్రాంతి): ఆగస్టు 10న జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొక్కెరపాటి పుల్లయ్య పిలుపునిచ్చారు. మంగళవారం మందలపల్లి సుందరయ్య భవన్లో సిఐటియు, రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం నయా ఉదారవాద ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేస్తూ కార్మిక హక్కులను కాల రాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు లేబర్ కోడ్ల అమలు ద్వారా 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచే అవకాశం కల్పించారని, ఉద్యోగ భద్రతను బలహినపరిచారని, సమ్మె హక్కు పై ఆంక్షలు విధించారని విమర్శించారు.

కార్మిక సంఘాల గుర్తింపు రిజిస్ట్రేషన్ ప్రక్రియను కఠిన తరం చేసి హైర్ ఆండ్ ఫైర్ విధానంతో కార్మికులను ఎలాంటి నోటీసు లేకుండా తొలగించే పరిస్థితి తీసుకువచ్చారని అన్నారు. ఈ లేబర్ కోడ్లలను పూర్తిగా ఉపసంహరించుకునే వరకు పోరాటాన్ని కొనసాగించాలని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం దేశాన్ని విదేశీ పాలన నుంచి విముక్తి చేసినట్టే నేడు కార్పొరేట్ ఆధిపత్యం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటమే మార్గమని, అందుకు ఆగస్టు 10 న నిర్వహించే రాష్ట్రా వ్యాప్త జైల్ భరో కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు, రైతులు, కస్టజీవులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు పిల్లి నాయుడు, రైతు సంఘం మండల అధ్యక్షుడు ఎం రామ్మోహన్రావు అధ్యక్షత వహించారు.