తెలంగాణలో అధికారమే లక్ష్యం
ప్రతి కార్యకర్త కంకణబద్ధులై పనిచేయాలి
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి: ఎంపీ డీకే అరుణ
మహబూబ్‌నగర్ జూన్ 5 (విజయక్రాంతి): తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కంకణబద్ధులై పని చేయాలని మహబూబ్‌నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతులను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. మోదీ నాయకత్వంపై విశ్వాసం, కార్యకర్తల దీక్ష, పట్టుదల.. పశ్చిమబంగాల్ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చాయన్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణ లోనూ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని కోరారు.
ప్రజలకు అందుబాటు లో ఉంటూ స్థానిక సమస్యలపై పోరాటం, దీక్షలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి పట్టంకట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేసి మరింత ఆదరాభిమానాలు చూరగొనాలని సూచించారు. పాలమూరు జిల్లాలోని 14 ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ గెలుచుకునే సమయం తప్పక వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రేవంత్‌వి గాలి మాటలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గాలి మోటర్ల లో తిరుగుతూ.. గాలి మాటలు చెబుతున్నారని ఎంపీ డీకే అరుణ ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధిపైన అవగాహన, చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తెలంగాణను బీఆర్‌ఎస్ పదేళ్లు దోచుకుందని మండిపడ్డారు. కుర్చీ వేసుకొని పదేళ్లలో పాలమూ రురంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని.. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి నిధులిచ్చింది లేదు.. ఏ పని చేసింది లేదని విమర్శించారు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పనులు ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటి నుంచి ఇవ్వడం లేదని.. కేంద్ర నిధులు, ప్రజల సొమ్ము తో నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, సీఎం నియోజకవర్గం కొడంగల్‌లో నిన్న, ఇవాళ కొన్ని రోడ్లు వేస్తున్నారని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జరుగుతున్న రహదారుల పనులు కేంద్ర నిధుల తో చేపట్టినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభు త్వం ఇచ్చిన హామీల్లో 90 శాతం ఎగ్గొట్టిందన్నారు.రైతులు, నిరుద్యోగులను, ఉద్యోగు లు.. అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ నాయకులు పద్మజారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.






