28 July, 2026 | 7:33 PM

మత్తు పదార్థాల జోలికొస్తే పీడీ యాక్ట్

28-07-2026 06:51 PM

యువత మత్తు ఇంజెక్షన్ల వైపు మళ్లడం ఆందోళనకరం 

 మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకపోతే కఠిన చర్యలు

మంథని లో ఏసీపీ మడత రమేష్ తీవ్ర హెచ్చరిక

మంథని,(విజయక్రాంతి): యువత మత్తు ఇంజెక్షన్ల బారిన పడుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, మాదకద్రవ్యాల విక్రయం, సరఫరాకు పాల్పడే వారిపై ఎంతటి వారైనా పీడీ యాక్ట్  ప్రయోగిస్తామని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ స్పష్టం చేశారు. తెలంగాణను డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మంథని డివిజన్‌లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

మంథని పోలీస్ స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ... రామగుండం సీపీ ఆదేశాల మేరకు మంథని డివిజన్‌లో గంజాయి, డ్రగ్స్ సరఫరాపై నిరంతర నిఘా ఉంచామని, గంజాయి కొరత కారణంగా కొంతమంది యువకులు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా లభించే కొన్ని మత్తు మాత్రలను ద్రవరూపంలోకి మార్చి, ఇంజెక్షన్ల ద్వారా తీసుకుంటున్నట్లు గుర్తించామని, ఈ కేసులో నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

మెడికల్ షాపుల యజమానులకు ఆదేశాలు

గంజాయికి ప్రత్యామ్నాయంగా మత్తు మాత్రలను ఇంజెక్షన్లుగా వాడటం ప్రాణాంతకమని ఏసీపీ హెచ్చరించారు. మంథని ప్రాంతంలోని మెడికల్ షాపుల యజమానులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, చెల్లుబాటు అయ్యే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మాత్రలు అమ్మకూడదని ఆదేశించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు.

తల్లిదండ్రులు, కళాశాలల బాధ్యత

పిల్లలపై కన్నేసి ఉంచాలి

తల్లిదండ్రులు తమ పిల్లల అలవాట్లు, స్నేహితుల తీరుపై అప్రమత్తంగా ఉండాలని, కళాశాలల సమాచారం: పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని,  మత్తుకు బానిసలైన యువతను మొదట బాధితులుగా భావించి డి-అడిక్షన్ కేంద్రాల ద్వారా ఉచిత కౌన్సిలింగ్, చికిత్స అందిస్తామని, 

మత్తు పదార్థాల వ్యాపారం చేసే పెడ్లర్లు, సరఫరాదారుల విషయంలో ఎలాంటి సహనం వహించబోమని ఏసీపీ తేల్చిచెప్పారు. ఎన్‌డీపీఎస్ చట్టంతో పాటు పీడీ యాక్ట్ కింద జైలుకు పంపుతామని హెచ్చరించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సమాజంలో అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలని ఏసీపీ రమేష్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంథని సీఐ బుద్ధి స్వామి, ఎస్ఐ సందీప్ కుమార్, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, సిబ్బంది పాల్గొన్నారు.