28 July, 2026 | 7:28 PM

హెపటైటిస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి

28-07-2026 06:42 PM

జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా.ఏంజెలా ఆల్ఫ్రెడ్

సిరిసిల్ల,(విజయక్రాంతి): ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా హెపటైటిస్ అనేది కాలేయాన్ని ప్రభావితం చేసే వైరల్ వ్యాధి అని, దీనిపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారా వ్యాధిని నివారించవచ్చని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి  డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్ఒక ప్రకటనలో తెలిపారు.హెపటైటిస్-ఎ,బిసి,డి,ఈ వైరస్‌ల వల్ల ఈ వ్యాధి సోకుతుందని, ముఖ్యంగా హెపటైటిస్-బి, హెపటైటిస్-సి దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు, లివర్ సిరోసిస్, కాలేయ క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశం ఉందన్నారు. హెపటైటిస్-బి టీకా వేయించుకోవడం, సురక్షిత రక్త మార్పిడి, ఒకసారి మాత్రమే ఉపయోగించే శుభ్రమైన సూదులు వినియోగించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం ద్వారా హెపటైటిస్ వ్యాధిని నివారించవచ్చని తెలిపారు.

అలసట, జ్వరం, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, కళ్లలో, చర్మంలో పసుపు రంగు కనిపించడం, ముదురు రంగు మూత్రం వంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో హెపటైటిస్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజలు వ్యాధిపై అపోహలను వీడి ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైన వారు పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలని డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్ కోరారు.