28 July, 2026 | 7:10 PM

రోడ్డు కాదు చెరువే..!

28-07-2026 06:29 PM

* నిజాంపూర్ ప్రధాన రహదారి దుస్థితి 

* ఆరు గ్రామాల ప్రజలకు నిత్యం నరకయాతన

సదాశివపేట: సదాశివపేట మండలంలోని నిజాంపూర్ ప్రధాన రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారంతా భారీ గుంతలతో నిండిపోయి, వాటిలో నీరు నిల్వ ఉండటంతో చూస్తే ఇది రోడ్డా లేక చెరువా? అనే పరిస్థితి నెలకొంది. ప్రజల రాకపోకలకు అత్యంత కీలకమైన ఈ మార్గం ఇప్పుడు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ రహదారిని నిజాంపూర్, కొల్కూర్, పొట్టిపల్లి, మాచిరెడ్డిపల్లి, తిమ్మన్నగూడెం కి చెందిన ప్రజలు ప్రతిరోజూ వినియోగిస్తున్నారు.

ఆరు గ్రామాల ప్రజలు విద్య, వైద్యం, వ్యవసాయ పనులు, ఉద్యోగాలు, వ్యాపార అవసరాల కోసం ఈ మార్గంపైనే ఆధారపడుతున్నారు. అయితే రహదారి దారుణ స్థితి కారణంగా ప్రతి ప్రయాణం ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితిగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వర్షపు నీటితో గుంతలు పూర్తిగా కప్పుకుపోవడంతో వాటి లోతు అంచనా వేయలేక ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు సైతం ఈ రహదారిపై వేగంగా ప్రయాణించలేని పరిస్థితి నెలకొంది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, విద్యార్థులు, ఉద్యోగులు ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

స్థానికులు ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేసినా రహదారి మరమ్మతుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. "ఆరు గ్రామాల ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడా?" అని వారు ప్రశ్నిస్తున్నారు.ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ ప్రధాన రహదారిపై మరిన్ని ప్రమాదాలు జరగకముందే ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి శాశ్వత మరమ్మతులు చేపట్టి ప్రజలకు సురక్షిత రవాణా సౌకర్యం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రహదారి పరిస్థితి పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని వారు విమర్శిస్తున్నారు.