28 July, 2026 | 7:11 PM

బాలింతల అస్వస్థతకు డాక్టర్, ఇద్దరు నర్సుల నిర్లక్ష్యమే కారణం

28-07-2026 06:23 PM

నిర్లక్ష్యమే 5 మంది బాలింతల ప్రాణాలతో చెలగాటం

ఇద్దరు నర్సుల సస్పెండ్, అనస్థీషియా డాక్టర్ విధుల నుంచి తొలగింపు

బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతల అస్వస్థతపై ప్రభుత్వం సీరియస్

ఇంకా నిమ్స్‌లో ఐదుగురికీ కొనసాగుతున్న ప్రత్యేక వైద్య చికిత్సలు

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో జరిగిన సిజేరియన్ నిర్లక్ష్యం వల్లే ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురయ్యారని ఉన్నత అధికారుల విచారణలో తేలింది.గత 15 రోజుల క్రితం శుక్ర, శనివారాల్లో చేసిన 10 సిజెరియన్లలో 5గురు బాలింతలు ఆపరేషన్ అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టగా, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే ప్రధాన కారణమని నిర్ధారించారు. దీంతో వెంటనే కఠిన చర్యలు తీసుకున్నారు.ఒకేసారి 5గురు బాలింతలు ఒకేలాంటి లక్షణాలతో అస్వస్థతకు గురీకావడంపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.

కారణాలు కనుగొనేందుకు నిమ్స్‌కు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు, డైరెక్టర్‌ను ప్రిన్సిపల్ సెక్రటరీ బాన్సువాడకు పంపారు. వారు ఆపరేషన్ థియేటర్, వాడిన పరికరాలు, మందులు, శస్త్రచికిత్స విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బందిని విచారించారు. కొన్ని మందులు, పరికరాల శాంపిల్స్‌ను ల్యాబ్ టెస్టుల కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. మాతా శిశు ఆసుపత్రిలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న ఇద్దరు స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేశారు. వీరిది పిట్లం మండలం ఆపరేషన్‌కు మత్తు మందు ఇచ్చిన అనస్థీషియా వైద్యుడిని విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ జాతీయ, రాష్ట్రస్థాయి కాయకల్ప అవార్డులు పొందిన బాన్సువాడ ఏరియా ఆసుపత్రి చరిత్రలో ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి.

బాన్సువాడతో పాటు ఎల్లారెడ్డి, జుక్కల్, నారాయణఖేడ్, బోధన్ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా రోగులు ఇక్కడికి వస్తుంటారు.సిజెరియన్ చేసుకున్న హుమేరా ఫాతిమా, రుక్సానా, జ్యోతి, లక్ష్మి ప్రియ, సునీతలను నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తు ఆదేశాలతో ఐదుగురికీ ఒకే చోట మెరుగైన చికిత్స అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అందరూ నిమ్స్ ICUలో డయాలసిస్‌తో పాటు ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య వివరాలు తెలుసుకుంటున్నారు.

రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా అధికారులతో మాట్లాడి సూచనలు ఇస్తున్నారు.ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీనివాస్ మాట్లాడుతూ,ఐదుగురూ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఉన్నతాధికారుల విచారణలో నిర్లక్ష్యం తేలడంతో ఇద్దరు నర్సులు, ఒక అనస్థీషియా డాక్టర్‌పై చర్యలు తీసుకున్నాం అని తెలిపారు.ప్రభుత్వం ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనుంది.