28 July, 2026 | 7:14 PM

వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయాలి

28-07-2026 06:35 PM

రైతు నేస్తం కార్యక్రమంతో రైతాంగానికి వ్యవసాయ విషయాలపై స్పష్టమైన అవగాహన

రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మారుపాక రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్

వేములవాడ,(విజయక్రాంతి): రైతు నేస్తం 100వ ఎపిసోడ్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ నుంచి, మంగళవారం మంత్రి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల్లోని మండలాల రైతు వేదికల ద్వారా అధికారులు, రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, వేములవాడ అర్బన్ మండలం మారుపాక రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, వ్యవసాయాన్ని సులభంగా, లాభసాటిగా మార్చేందుకు సాంకేతికతను వ్యవసాయ రంగానికి జోడించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. 

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆరుతడి పంటలు సాగు చేయాలన్నారు. ఉద్యానవన పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలువురు ఆదర్శ రైతులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సన్మానించారు. అనంతరం మారుపాక రైతు వేదికలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ... ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, భూగర్భ జలాలు తగ్గుతున్నాయని వెల్లడించారు. జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 36 శాతం వర్షపాతం తక్కువగా నమోదు అయిందని తెలిపారు. 

వేములవాడ అర్బన్ మండలంలో 20 మీటర్ల లోతులోకి వెళ్ళాయని పేర్కొన్నారు. రైతులకు కావలసిన విత్తనాలు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.తెలంగాణ జలసిరి కింద బోర్ వెల్స్ రీచార్జ్ పనులు, పామ్ పాండ్స్ నిర్మాణాలు, ఇతర జల సంరక్షణ పనులు ముమ్మరంగా చేయించాలని ఆదేశించారు. ప్రతి వర్షం నీటి బొట్టును ఒడిసి పట్టాలని పిలుపు నిచ్చారు. ఇప్పుడు వర్షాకాలంలో నీటిని కాపాడితే  రానున్న రబీ సీజన్లో ఇబ్బందులు రావని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు.

తినకముందు తిన్న తర్వాత చేతులు కడుక్కోవాలని తెలిపారు. అందరూ వేడి చేసి చల్లారిన తర్వాత నీటిని తాగాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. కార్యక్రమంలో వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వేములవాడ డివిజన్ ఆత్మ కమిటీ అధ్యక్షుడు ముస్కు ముకుందరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సాయి కుమార్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ జయంత్ కుమార్, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, సర్పంచ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.