ఓబీసీల ఉద్యమ ఫలితాలు ఖాయం
జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడూరి శ్రీమన్నారాయణ
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హోరెత్తిన బీసీల గళం
పెద్దపల్లి జిల్లా నుండి భారీగా తరలివెళ్లిన ఉద్యమకారులు
పెద్దపల్లి,(విజయక్రాంతి): చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు కేంద్రంలో ప్రత్యేక ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడూరి శ్రీమన్నారాయణ స్పష్టం చేశారు. 'జెన్ జీ' ఆలోచనా విధానంతో ఓబీసీలు ముందడుగు వేయాలని, ఢిల్లీ కేంద్రంగానే హక్కుల సాధనకు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య అధ్యక్షతన మంగళవారం రెండో రోజు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో తాడూరి శ్రీమన్నారాయణ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా తాడూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ... దేశంలో 60 శాతం జనాభా ఉన్న ఓబీసీలకు రాజ్యాంగపరంగా దక్కాల్సిన వాటా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసపూరిత విధానాలతో నష్టపరుస్తున్నారని విమర్శించారు. ఓబీసీలు అగ్రవర్ణ పార్టీలకు తాబేదారులుగా మారకూడదని, ఓటు హక్కు శక్తితోనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని వెల్లడించారు. దళితులు, మైనార్టీలను కలుపుకొని ఉద్యమ ప్రణాళిక రూపొందించాలని ఆర్. కృష్ణయ్యకు సూచించారు.
ఈ ధర్నా కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా నుండి దాదాపు 100 మంది బీసీ ఉద్యమకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా నాయకులు ఇచ్చే నినాదాలకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ఉద్యమకారులు కోరస్ అందుకోవడంతో జంతర్ మంతర్ ప్రాంగణం బీసీల చైతన్యంతో మారుమోగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వందలాది మంది ఉద్యమకారులు, బీసీ మహిళలు తరలివచ్చి ఢిల్లీ వీధుల్లో బీసీల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని శ్రీమన్నారాయణ పేర్కొన్నారు.






