జ్ఞాపకాల చొక్కా
నే దాచుకున్న చినిగిన జ్ఞాపకాల చొక్కా
పట్నం బస్సు స్టాండ్‌జిలో తప్పిపోయింది
ఆ పాత అంగిలోనే
నా నవ్వుల రాశులు పోగు చేసుకున్నా
అమ్మ చెమట వాసన
నాన్న చేతి కష్టం
బాల్యపు గాలివాన
తొలకరి మట్టివాసన అందులోనే ఉన్నాయి
పచ్చని పైరులిచ్చే పిల్లగాలి
ఛాతిలో ధైర్యాన్ని నింపేది
బాటంట పోతుంటే
గ్రామ సింహం.. అదే మా కుక్క స్నేహితుడు
నన్ను చూడగానే తోక ఊపుతూ పలకరించేది !
****
నాటి పక్షుల రాగాలకు
రోగం కూడా భయపడి పారిపోయేది
కోయిల కూతలకు
మనసు మళ్లీ పుట్టినట్టుండేది..
కానీ..ఇప్పుడు
పట్నంలో అందరూ మౌన వ్రతం చేసే చుట్టాలే
పక్షులేమో పన్ను కట్టలేక రాలేకున్నాయేమో
వీసా లేక నగరంలోకి అడుగు పెట్టలేకపోతున్నాయేమో
రంగులతో మెరిసే భవంతులతా
పోటీ పడలేక పచ్చని చెట్లు
నగరం నుంచి వలసపోయాయి.
****
ఒకప్పుడు
మట్టివీధుల్లో నా అడుగులు పూలై పూశాయి
ఇక్కడ కాంక్రీట్ వీధుల్లో
అడుగులు కూడా ప్రతిధ్వనించవు
అప్పుడు చెరువు నీరు
ఆకాశాన్ని ఒడిలో పెట్టుకునేది
ఇప్పుడు గాజు భవంతులు
ఆకాశాన్ని బంధించుకున్నాయి.
అక్కడి పొలాల్లో గాలి స్వేచ్ఛగా పరిగెత్తేది
ఇక్కడ గాలి కూడా ఏసీ గదుల్లో బందీ అయింది
పొలం గట్లపై కూర్చొని తిన్న జొన్న రొట్టె
రాజభోజనంలా అనిపించింది
రాజభవనంలో వేల రూపాయల విందులో ఆ రుచి కనిపించలేదు
పట్నం నాకు విద్యుత్ దీపాలిచ్చింది
రోడ్లిచ్చింది
గాజు భవంతులు ఇచ్చింది
సౌకర్యాల మాయలో నన్ను ముంచింది
కానీ, నా నుంచి తీసుకుపోయింది మాత్రం
పెద్ద జాబితా .. ఒక చెట్టు నీడ
బాల్యపు జ్ఞాపకాలు
ఇప్పుడు నేను వెతుకుతున్నది
మట్టివాసన దాగి ఉన్న
ఆ చినిగిన జ్ఞాపకాల చొక్కా !
ఎందుకంటే..
ఆ చొక్కా దొరికితే
బట్టను కాదు బాల్యాన్ని ధరిస్తాను
ఆ బాల్యాన్ని ధరిస్తేనే
నాలో ఇంకా బతికున్న
ఆ చిన్న పిల్లాడు
మళ్లీ నవ్వుతాడు !
దుప్పటి మొగిలి




