9 May, 2026 | 1:58 AM

రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు బంగాల్ గతే!

09-05-2026 12:40 AM
  1. మహిళా రిజర్వేషన్‌ను ఇండీ కూటమి వ్యతిరేకించింది
  2. ఇప్పటివరకు తెలంగాణకు 13 లక్షల కోట్ల కేంద్ర నిధులు
  3. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు 
  4. ప్రధాని మోదీ సభ ఏర్పాట్ల పరిశీలన

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): మహిళా రిజర్వేషన్ బిల్లును ఇండీ కూట మి అడ్డుకున్నదని, బంగాల్‌లో టీఎంసీకి బుద్ధి చెప్పినట్టే తెలంగాణలోనూ మహిళలు కాంగ్రెస్‌కు బుద్ధిచెప్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణకు రూ.13 లక్ష ల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారని, సభ లో మహిళలు ఎక్కువగా పాల్గొంటారని వివరించారు.

రాష్ట్రంలో సుమారు రూ.8 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రజలకు కానుకగా ఇచ్చేందుకు మోదీ ఆదివారం తెలంగాణకు వస్తున్నారని తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జర గనున్న మోదీ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం రామచందర్‌రావు పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సభా వేదిక నిర్మాణం, బారికేడ్ల ఏర్పాటు, జనసమీకరణ, వసతి సౌక ర్యాలపై పార్టీ శ్రేణులు, అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. దేశంలో మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలిసారి తెలంగాణకు రావడం, అదేవిధంగా తాను రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని రాక ఇదే మొదటిసారి కావడం విశేషమని హర్షం వ్యక్తంచేశారు. మోదీకి రాష్ట్ర ప్రజలు ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక ల్లో అసోం, పుదుచ్చేరితోపాటు జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ స్వస్థలమైన పశ్చిమ బంగాల్‌లో బీజేపీ సాధించిన విజయం చరిత్రాత్మకమని పే ర్కొన్నారు.

పశ్చిమ బంగాల్‌లో గతంలో ఒక్క సీటు కూడా లేని పరిస్థితి నుంచి గత ఎన్నికల్లో బీజేపీ 78 సీట్లు సాధించి ప్రధా న ప్రతిపక్షంగా నిలిచి కమ్యూనిస్టులను, కాంగ్రెస్ పార్టీల అరాచకాలను ధీటుగా ఎదుర్కొన్నదని వివరించారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధిం చి అధికారంలోకి వచ్చిందని, ఆ గెలుపు ఉత్సాహం తెలంగాణ ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ కనిపిస్తున్నదని వెల్లడించారు.

మరోవైపు మహిళలకు చట్టసభల్లో 33 శా తం రిజర్వేషన్లు కల్పించే ‘నారీశక్తి వందన్ అధినియం’ చట్టాన్ని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చేలా ప్రయత్నిస్తే కాంగ్రెస్, ఇండీ కూటమి పార్టీలు అడ్డుకోవడంపై మండిపడ్డారు. ఈ సభకు మహిళలు, యువత, మేధావులు అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా తరలివస్తున్నారని తెలిపారు. 

సభకు 2 లక్షల మంది..

ఈ చరిత్రాత్మక సభను విజయవంతం చేసేందుకు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ పదాధికారులు శ్రమిస్తున్నారని, సుమారు 2 లక్షల మందితో భారీ జనసమీకరణ చేస్తున్నామని రాంచందర్‌రావు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు రైలు టికెట్లు కొనుక్కొని మరీ స్వచ్ఛందంగా తరలివస్తున్నారని చె ప్పారు

. కార్యకర్తలను పోలీసులు దూరం గా ఆపకుండా, శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ ప్రజలు సభాస్థలికి చేరుకునేలా సహ కరించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జ్ ఎన్వీ సుభాష్, మాజీ ఎమ్మెల్యే చిం తల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.