9 May, 2026 | 2:32 AM

నలుగురు నేరస్తులకు జీవిత ఖైదు

09-05-2026 01:50 AM

తప్పు చేస్తే ఎప్పటికైనా జైలు శిక్షలు తప్పవు

చట్టాన్ని ఉల్లంఘించి నేరాలకు పాల్పడితే శిక్షలు తప్పువు

కేసుల దర్యాప్తులలో పోలీసులు అత్యంత నైపుణ్యంతో విధినిర్వాహణ

సూర్యాపేట జిల్లా ఎస్పి కొత్తపల్లి నరసింహ ఐపిఎస్

హుజూర్ నగర్, మే 8 : తప్పు చేస్తే ఎప్పటికైనా జైలు శిక్షలు తప్పవని,చట్టాన్ని ఉల్లంఘించి నేరాలకు పాల్పడితే శిక్షలు తప్పువని,కేసుల దర్యాప్తులలో పోలీసులు అత్యంత నైపుణ్యంతో విధి నిర్వాహణ కలిగి ఉన్నారని సూర్యాపేట జిల్లా ఎస్పి కొత్తపల్లి నరసింహ ఐపిఎస్ అన్నారు.

మంత్రాల నేపథ్యం, భూవివాదం ఘటనలో 2015 సంవత్సరంలో జరిగిన హత్య కేసులో పోలీస్ శాఖ అత్యంత పారదర్శకమైన దర్యాప్తు చేసి బలమైన సాక్షాలు ఆధారాలతో నేర అభియోగ పత్రాలు కోర్టులో దాఖలు చేసి, సకాలంలో బాధితులను, సాక్షులను, నిందితులను కోర్టుకు హాజరుపచగా వాదనలు విన్న హుజూర్ నగర్ రెండవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు నలుగురు నేరస్తులు నేరానికి పాల్పడ్డారని గుర్తించి జీవిత ఖైదు జైలు శిక్ష విధించారని జిల్లా ఎస్పి నరసింహ కేసు వివరాలు వెల్లడించారు.

కేసు వివరాలలోకి వెళితే గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన యెడిపాల వీరారెడ్డి, యెడిపాల లింగారెడ్డి అనే ఈ రెండు కుటుంబాల మధ్య భూ వివాదం ఉన్నది.ఈ వివాదంలో ఇరు కుటుంబాలు నిత్యం గొడవ పడేవారు ఇందులో లింగారెడ్డి కుమారుడు అనారోగ్యానికి గురికావడానికి కారణం వీరారెడ్డి మంత్రాలు చేస్తున్నాడని నమ్మకంతో హత్య చేశారు.

2015సం.లో జూలై నెల 19న సాయంత్రం సమయంలో వీరారెడ్డి వ్యవసాయ భూమి మోటర్ అఫ్ చేసి వస్తానని తన కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లి తిరిగి రానందున వీరారెడ్డి గురించి వెతికిన అతని ఆచూకీ లభించనందున అతని కుమారుడు వీర భాస్కర్ రెడ్డి గరిడేపల్లి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు పై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా అదే 21వ తేదీ సాయంత్రం వీరారెడ్డి రిజర్వాయర్ లో గన్ని బ్యాగులో లభించినది.

మిస్సింగ్ కేసును హత్య కేసుగా అప్పటి సీఐ తదుపరి విచారణ చేపట్టి యెడిపాల లింగారెడ్డి, యెడిపాల సత్యనారాయణ రెడ్డి, యెడిపాల ఉపేందర్ రెడ్డి, యెడిపాల సైదిరెడ్డి నలుగురు నిందితులను అరెస్టు చేసి నేరానికి పాల్పడ్డారని విచారించిన కోర్టు నిందితులకు జీవిత ఖైదు విధించారు. ఈ కేసును చేదించడంలో కీలక పాత్ర వహించిన కోదాడ డిఎస్పీ శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు పర్యవేక్షణలో సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టడంతో బాధితుల తరపున కేసును పీపీ బొబ్బ కోటిరెడ్డి బలమైన వాదనలు వినిపించారు.గరిడేపల్లి ఎస్‌ఐ నరేష్,కోర్టు కానిస్టేబుల్ లు సైదులును జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.