9 May, 2026 | 2:41 AM

దొంగే దొంగ అన్న చందంగా మాజీ మంత్రి హరీశ్‌రావు తీరు

09-05-2026 01:47 AM

కాంగ్రెస్ నాయకులు

కోదాడ, మే 8 : మాజీ మంత్రి హరీశ్రావు తీరు దొంగే దొంగ అన్న చందంగా ఉందని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలో సమావేశంలో మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలపై హరీశ్రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

ప్రజల్లో గందరగోళం సృష్టించేలా అసత్య ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగడం తగదన్నారు. ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని, వాస్తవాలు తెలుసుకునే స్థాయిలో ఉన్నారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిన సేవల గురించి చెప్పకుండా ఇప్పుడు ఆరోపణల రాజకీయాలకు పాల్పడటం సరైంది కాదన్నారు.

ఉత్తమ్కుమార్రెడ్డి, పద్మావతి రెడ్డి ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకులని, వారి ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడటం దురుద్దేశపూరితమని అన్నారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకే హరీశ్రావు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా హరీశ్రావు బాధ్యతాయుతంగా వ్యవహరించి వాస్తవాల ఆధారంగా మాట్లాడాలని సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మీనారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతమ్మ సుధీర్, వైస్ చైర్మన్ బషీర్, నల్లపాటి శ్రీనివాస్, ముత్తవరపు పాండురంగారావు, పార సీతయ్య, కందుల కోటేశ్వరరావు, వరప్రసాద్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఇర్లా సీతారాంరెడ్డి, కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.