9 May, 2026 | 2:18 AM

ఓ సామాజిక బాధ్యత

09-05-2026 12:47 AM

మూసీ పునరుజ్జీవం ప్రక్షాళన మాత్రమే కాదు.. 

  1. ప్రజల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ప్రాధాన్యత
  2. రాజధాని అభివృద్ధిలో మైలురాయిగా ప్రాజెక్టు 
  3. లక్ష్యం: ఆగస్టు నాటికి పనులు ప్రారంభం, 2027 డిసెంబర్ నాటికి పూర్తి
  4. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు కేవ లం ఒక నది ప్రక్షాళన మాత్రమే కాదు.. అది ఒక సామాజిక బాధ్యత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ అన్నారు. అభివృద్ధి అంటే మనుషులను దూరం చేయడం కాదు, వారిని భాగస్వాములను చేయడమేనని పేర్కొంటూ వారు అధికారులకు కీలక మార్గదర్శకాలను జారీచేశారు.

ఈ ప్రాజెక్టును అత్యంత పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి, వారిలో పూర్తిస్థాయి విశ్వసనీయత కల్పించేలా అధికారుల కార్యాచరణ ఉండాలని మం త్రుల సబ్ కమిటీ ఆదేశించింది. ప్రజల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ప్రథ మ ప్రాధాన్యత అని కమిటీ నొక్కి చెప్పింది.

ప్రజల ఆస్తులకు, నివాసాలకు కనీస నష్టం కూడా కలగకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచిస్తోందని, ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఇప్పటికే ఉన్న నిర్మాణాలపై అతి తక్కువ ప్రభావం పడేలా అలైన్‌మెంట్‌ను మార్చుకోవాలని కమిటీ సూచించింది. అత్యంత జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించి, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించింది.

మూసీ పునరుజ్జీవం ద్వారా నగరం రూపురేఖలు మారడమే కాకుండా, పరివాహక ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయని, ప్రజల భాగస్వామ్యంతోనే  ప్రాజెక్టు సాకారం అవుతుందని ‘అభివృద్ధి రెండూ సమాంతరంగా సాగాలని క్యాబినెట్ సబ్ కమిటీ అధికారులకు దిశ నిర్దేశం చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం శుక్రవారం ప్రజాభవన్‌లో నిర్వహించారు.

మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి డిప్యూటీ సీఎం ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షించారు.  ప్రాజె క్టు పురోగతి, నిధుల సమీకరణ, నిర్మాణ పనులకు సంబంధించి న క్యాలెండర్‌పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మూసీ పునర్జీవ ప్రాజెక్టు 5 దశల్లో 55 కిలోమీటర్ల వరకు అభివృద్ధ్ది పనులు చేపట్టనున్నామని, దీనిలో భాగంగా ఫేజ్ సుమారు రూ. 7,055 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) నుంచి నిధులు సమకూర్చుకునేందుకు సాంకేతిక, ఆర్థిక చర్చలు విజయవంతంగా ముగిశాయని అధికారులు మంత్రులకు వెల్ల డిం చారు. ఫేజ్ భాగంగా హిమాయత్‌సాగర్ నుంచి బాపుఘాట్, ఉస్మాన్‌సాగార్ నుంచి బాపుఘాట్ 21 కిలోమీటర్ల మేరకు నిర్మాణ పనులను ఎటువంటి ప్రభావం లేని తొలి ఐదు కిలోమీటర్ల పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. 

ఐఐటీ, జేఎన్‌టీయూ సహకారం తీసుకోవాలి: మంత్రి శ్రీధర్‌బాబు

టైంలైన్ నిర్దేశించుకొని స్పష్టమైన పురోగతి కనిపించే విధంగా పనుల నిర్మాణం జరుగాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు సూచించారు. ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా  పనులను సత్వరమే ప్రారంభించి ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో సాంకే తికపరమైన అంశాలలో ఐఐటీ, జేఎన్‌టీ యూ సంస్థల నుంచి తగిన సహాకారం తీసుకోవాలని సూచించారు. 

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రానున్న వర్షకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మాణ పనుల కు ఆటంకం కలగకుండాజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మూసీ పునర్జీవం ప్రాజెక్టులో టూరిజం అభివృద్ధిలో భాగంగా నదిలో పలుచోట్ల చెక్‌డ్యాంల తరహాలో రబ్బర్ డ్యాంలు ఏర్పా టు చేయనున్నారు. వీటి నిర్మాణాల వల్ల నీటి నిల్వను పెంచడం, జలక్రీడలు, బోటింగ్‌కు ఉపయోగపడుతుంది.

ఒబెర్ మేయర్ స్పిల్ వే గేట్ టెక్నాలజీ రూపొందించిన రబ్బర్ డ్యాం నమూనాను మంత్రులు తిలకించారు. నాసిక్, ముంబయి నగరాల్లో ఈ టెక్నాలజీ సంస్థ నిర్మాణం చేసిన రబ్బర్ డ్యాంలను పరిశీలించి అధ్యయనం చేసిన తరువాత నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రులు అదేశించారు. సమావేశంలో మెట్రోపాలిటన్ ఏరియా అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్క ర్, వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి, జా యింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

2026 ఆగస్టు నాటికి పనులు ప్రారంభించడమే లక్ష్యం

మూసీ పునర్జీవంలో భాగంగా నదిలో ఉన్న చెత్త చెదరాన్ని తొలగించి, పరిశుభ్ర పర్చడం, హైడ్రాలజీ ప్రకారంగా రివర్ బెడ్ ప్రొఫైలింగ్ చేయడం, వరద నియంత్రణ కోసం రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, నదికి రెండు వైపులా రోడ్ల నిర్మాణం, నదికి రెండు వైపులా ప్రధాన మురుగు నీటి కాలువల నిర్మాణం, నాలాలు ఏర్పాటు, నీటి నిల్వ కోసం బ్యారేజీల నిర్మాణం, రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేయనున్నట్టు రూపొందించిన డీపీఆర్‌ను మూసీ ప్రాజెక్టు మేనేజింగ్ డైరెక్టర్ ఈ.వీ నర్సింహ్మరెడ్డి మంత్రులకు వివరించారు.

ఈస్ట్- టు- వెస్ట్ కారిడార్‌లో భాగంగా నార్సింగి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణం చేయనున్నామని, ఉప్పల్ భగాయత్ నుంచి గౌరెల్లి వరకు విస్తరణపై డీపీఆర్ తయారీ దశలో ఉందని పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. మీరాలం ట్యాంకు పురోగతి పనులను వివరించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు కావాల్సిన భూమిని రక్షణ శాఖ నుంచి బదలాయింపు చేసుకునే అంశంపై చర్చించారు.

పర్యావరణానికి సంబంధించిన అన్ని అనుమతులను తీసుకొని ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి అధికారులను అదేశించారు, మూసీ ప్రాజెక్టు పునర్జీవం వల్ల కలిగే ఉపయోగాల గురించి నగరంలో విస్త్రతంగా ప్రచారం చేయాలని సూచించారు. బస్టాండ్లు, మెయిన్ రోడ్లు హోర్డింగ్స్ ఏర్పాటుచేయాల్సిందిగా ఆదేశించారు. సినిమా థియేటర్‌లలో కూడా వీడియోలను ప్రదర్శించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆర్థిక, అనుమతులు, విభాగాల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటుచేయాలన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఎక్కడా జాప్యం లేకుండా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. రాజధాని అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన గడువును నిర్ణయించిందని వెల్లడించారు.

అన్ని రకాల అనుమతులు, విధానపరమైన ప్రక్రియలు పూర్తి చేసుకుని 2026 ఆగస్టు నాటికి పనులు ప్రారంభించడానికి లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టును డిసెంబర్ 2027 నాటికి పూర్తిచేయాలన్నారు. దీనికి సంబంధించిన పూర్తి  క్యాలెండర్‌ను  సమర్పించాలని అధికారులను ఆదేశించారు.