23 March, 2026 | 6:17 PM

పలు కాకులు

23-03-2026 12:00 AM

నువ్వు ఏం చేసినా

ఏం చేయకపోయినా

లోకులు చురకల వాతలు

పెడుతూనే ఉంటారు

****

మంచి బట్టలు వేస్తే

ఫోజులు కొడుతున్నాడని

అతి సాధారణ దుస్తులు ధరిస్తే

పేద సన్నాసి అని కూస్తారు 

****

బరువు పెరిగితే

బాగా మెక్కుతున్నాడని

బక్క చిక్కితే

జబ్బు మనిషని వెకిలి చేస్తారు 

****

సీరియస్‌గా ఉంటే

వాడో బోరింగ్ నరుడని

హాస్య చతురత ప్రదర్శిస్తే

అన్నీ తేలికగా తీసుకునేవాడంటారు 

సంపాదిస్తే 

డబ్బు మనిషని

దుబారాగా తిరిగితే

పని పాట లేని వెధవని అంటారు

****

బాగుపడితే

ఈర్ష్య అసూయలు కుమ్మరిస్తూ..

చెడిపోతే

దరిద్రపు గొట్టోడని

అనడం పౌరుల ఏకైక పని 

****

నువ్వు చేసే పని

నీకు నచ్చితే చాలని

లోకులు పలుకాకులని

వారి మాటల తూటాలను

పెడచెవిన పెడుతూ

ముందుకు మౌనంగా సాగడమే

అసలైన పనిమంతుల పని !

 మధుపాళీ