23 March, 2026 | 4:48 PM

అడవి గుండెలో గర్జన హిడింబి

23-03-2026 12:00 AM

నరేష్కుమార్ సూఫీ :

మహాభారతంలో ఒక ఘట్టం ఉంది. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఒక అడవిలో హిడింబుడు అనే రాక్షసుడు, అతని చెల్లెలు హిడింబి ఎదురుపడతారు. భీముడు హిడింబుడిని చంపి, హిడింబిని పెళ్లి చేసుకుంటాడు. ఘటోత్కచుడు పుడతాడు. కథ అంతే. మనం ఎప్పుడూ భీముడి దృక్కోణంతోనే ఈ ఘట్టాన్ని చదివాం, చూశాం, విన్నాం. రాక్షసులు చెడ్డవాళ్లు. పాండవులు మంచివాళ్లు. అడవి వాళ్లది కాదు, రాజ్య విస్తరణకు అడవి ఆటంకం.

అంతే. కానీ, రచయిత నరేష్కుమార్ సూఫీ రాసిన ‘హిడింబి’ నవల ఆ కథను తిప్పేస్తుంది. ఇక్కడ కథ హిడింబి నోటి నుంచి వస్తుంది. హిడింబుడు నోటి నుంచి వస్తుంది. వాళ్ల జాతి పెద్దల నోటి నుంచి వస్తుంది. అడవి వాళ్ల ఇల్లు. వాళ్ల దేవుడు. వాళ్ల జీవనాధారం. దాన్ని కాపాడుకోవడమే వాళ్ల ధర్మం. అడవిని ఆక్రమించడమే పాండవుల ‘నాగరికత’. అడవి మనుషుల్ని రాక్షసులుగా ముద్ర వేయడమే వాళ్ల ‘ధర్మయుద్ధం’. ఈ కోణంలో చూస్తే హిడింబుడు ఒక రాక్షసుడు కాదు..- అడవిని కాపాడిన మొదటి గిరిజన యోధుడు.

హిడింబి ఒక ప్రేమికురాలు మాత్రమే కాదు.. తన అన్న తర్వాత ఆ బాధ్యతను మోసిన ధీరవనిత. ఈ నవలలో హిడింబుడు మరణించాడు. కానీ, హిడింబి మాత్రం జీవిస్తూనే ఉంది. ఆమె గర్జన ఆ గుండెలోంచి ఇప్పటికీ వినిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు కూడా అడవుల్లో హిడింబులు ఉన్నారు. హిడింబీలూ ఉన్నారు. వాళ్ల పేర్లు వేరు. వాళ్ల గ్రామాలు వేరు. కానీ, పోరాటం ఒక్కటే -- అడవిని కాపాడుకోవడం. అప్పట్లో రాజ్యాలు అడవులను ఆక్రమించాయి. ఇప్పుడు కార్పొరేట్ శక్తులు ఆక్రమిస్తున్నాయి.

అప్పుడు రాజ్యం పేరు హస్తినాపురం. ఇప్పుడు పేరు మల్టీనేషనల్ కంపెనీ. అప్పుడు ఆయుధాలు ఖడ్గాలు, గదలు. ఇప్పుడు బుల్డోజర్లు, బందూకులు, కోర్టు ఉత్తర్వులు. మారింది కేవలం రూపం మాత్రమే. లక్ష్యం మాత్రం ఒక్కటే -- అడవిని ఖాళీ చేయించి, ఆ భూమి మీద తమ సామ్రాజ్యం నిర్మించడం. ఒడిశాలోని కొండల్లో డోంగ్రియా కొండ్ గిరిజనులు ఇప్పటికీ తమ పవిత్ర కొండను కాపాడుకుంటున్నారు. ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో గోండ్, మురియా, మడియా గిరిజనులు తమ ఇల్లు, తమ అడవి కోసం పోరాడుతున్నారు.

ఝార్ఖండ్‌లో సంథాల్, హో, ముండా గిరిజనులు గనుల కోసం తమ భూములు లాగేసుకుపోతుంటే తమ బాణాలతో నిరసన తెలియజేస్తున్నారు. ఈ హిడింబులు ఎవరికీ కనిపించరు. వాళ్ల గొంతు టీవీ ఛానెళ్లలో రాదు. వాళ్ల పోరాటం ‘అభివృద్ధి’ అనే పెద్ద పేరుతో కప్పేస్తారు. అడవి లేకుండా చేస్తే ఏమవుతుంది? నీళ్లు లేకుండా పోతాయి. గాలి లేకుండా పోతుంది. భూమి మంటలు పుట్టిస్తుంది. ఈ హిడింబులు లేకుండా చేస్తే అడవి కాపాడే వాళ్లు ఎవరూ మిగలరు.

అప్పుడు మనం గాలి కోసం, నీళ్ల కోసం, ఆక్సిజన్ కోసం డబ్బులు ఇచ్చి కొనాల్సి వస్తుంది. ఆ రోజు దూరంలో లేదు. నరేష్కుమార్ సూఫీ ఈ నవల ద్వారా ఒక్కటే చెబుతున్నాడు -- హిడింబి ఒక వ్యక్తి కాదు. ఒక గుండె. ఒక గర్జన. ఆ గర్జన వేల ఏళ్ల క్రితం మొదలైంది. ఈ రోజు కూడా కొనసాగుతున్నది. ఆ గర్జనను వినలేని వాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు -- అడవి అంటే కేవలం చెట్ల సమూహం కాదు. అది ఒక జీవన విధానం. ఒక సంస్కృతి.

ఇది మన ఊపిరి. ఈ నవల చదివాక మీరు ఒక్కసారి ఆలోచిస్తారు -- నేను నివసించే ఈ నగరం ఒకప్పుడు ఎవరిదైనా అడవి అయి ఉంటుంది. ఎవరో ఒక హిడింబి దాన్ని కాపాడుకోవడానికి పోరాడి ఉండొచ్చు. ఆమె ఓడిపోయింది. ఇప్పుడు నా వంతు వచ్చింది. ఇప్పుడు మనం ఓడిపోతే... తర్వాత తరాలవాళ్లు ఎక్కడ ఊపిరి పీల్చుకుంటారు? ఝాన్సీ పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ నవల సుమారు 200 పేజీలు ఉంటుంది. కానీ, ఈ పుస్తకంలో వేల పేజీలకు సరిపడా వేల ఏళ్ల గర్జన దాగి ఉంది.

ఆ గర్జన మీ గుండెలోకి రావాలి. అప్పుడే ఈ పుస్తకం పూర్తవుతుంది. చదవండి. హిడింబి మాటలు మీలోనూ మార్మోగాలి. అది ఈ కాలం ఆదివాసీలకు, ఈ భూమికి మనం ఇచ్చే కనీస గౌరవం. ఈ నవలలో సూఫీ హిడింబి ద్వారా కేవలం అడవి పోరాటాన్ని మాత్రమే కాదు, స్త్రీ శక్తి, అణచివేతకు వ్యతిరేకంగా లేచిన ధైర్యాన్ని, ఆదిమ జాతుల ప్రేమ గాథను కూడా అద్భుతంగా చిత్రీకరించారు రచయిత.

భీముడితో ఆమె ప్రేమ-- అది కేవలం శారీరక ఆకర్షణ కాదు, రెండు విభిన్న జీవన విధానాల మధ్య జరిగిన ఒక లోతైన సంఘర్షణ, ఒక అసాధారణ సమన్వయం. ఆ ప్రేమ ద్వారా ఘటోత్కచుడు జన్మిస్తాడు -- ఆదివాసీ రక్తం, ఆర్య సంస్కృతి మిశ్రమంగా పుట్టిన ఒక కొత్త ఆశాకిరణం. ఈ విధంగా నవల మహాభారత కథను కేవలం తిరిగి చెప్పడమే కాక, దాన్ని ఆధునిక సందర్భంలో పునర్నిర్మించి, మన సమాజంలోని అసమానతలు, పర్యావరణ సమస్యలు, సాంస్కృతిక దోపిడీని బయటపెడుతుంది.

చివరగా, ఈ పుస్తకం చదివిన తర్వాత మనలో ఒక ప్రశ్న మిగిలిపోతుంది ..‘మనం ఏ పక్షంలో ఉన్నాం? హిడింబి గర్జన విని, ఆమెతో కలిసి అడవిని కాపాడేవారమా? లేక భీముడి గదతో అడవిని కూల్చేవారమా?’ ఈ ప్రశ్నకు సమాధానం మన చర్యల్లో ఉంటుంది. హిడింబి గర్జన ఇప్పటికీ మోగుతున్నది. -మన గుండెల్లోనూ ఆ గర్జనను మోగనివ్వాలి, దానిని మన స్వరంగా మార్చాలి.

 బాలు అగ్నివేష్ (సూక్ష్మజీవి)  

Baaluagnivesh@gmail.com