9 May, 2026 | 2:20 AM

భయం అవుట్ భరోసా ఇన్

09-05-2026 01:16 AM

బంగాల్ కొత్త సీఎం సువేందు 

  1. శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవం 
  2. నేడు ప్రమాణస్వీకార మహోత్సవం 
  3. హాజరుకానున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా సహా బీజేపీ అగ్రనేతలు
  4. డిప్యూటీ సీఎంలు ఇద్దరు? 
  5. వీరిలో ఒకరు మహిళ!

కోల్‌కతా, మే 8: పశ్చిమ బంగాల్ చరిత్రలో మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పార్టీ శాసన సభాపక్షనాయకుడిగా.. మాజీ గురువు మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారిని బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఒడిశా సీఎం మోహన్‌చరణ్ మాఝీ సమక్షం లో.. కోల్‌కతాలోని విశ్వ బంగ్లా కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన బీజేపీ శాసన సభాపక్ష సమావేశంలో సువేందు పేరును అమిత్‌షా ఖరారు చేశారు.

సువేందు పేరును భట్టాచార్య ప్రతిపాదించగా ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. బంగాల్‌లో సీఎంతోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నది. ఉపముఖ్యమంత్రిగా ఒక మహిళలకు అవకాశం  దక్కవచ్చు. రేసులో అగ్నిమిత్రపాల్, రూపాగంగూలీ ఉండగా, ఉత్తర బంగాల్‌కు చెందిన సిలిగురి ఎమ్మెల్యే శంకర్ ఘెష్ పేరు కూడా వినబడుతున్నది. అమిత్‌షా వీరితో విడివిడిగా భేటీ అయినా ఇంకా ఎవరి పేర్లనూ ప్రకటించలేదు.

శనివారం ఉదయం 11 గంటలకు కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో సువేందు ప్రమాణస్వీకారం చేయనున్నారు. పశ్చిమ బంగా ల్‌కు ఆయన 9వ ముఖ్యమంత్రిగా, బీజేపీ నుంచి రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కానున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, అమిత్‌షా, కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సహా బీజేపీ అగ్రనేతలు హాజరుకానున్నారు. మే 9న రవీంద్రనాథ్ ఠాగోర్ జయంతి. ఇదే రోజును బంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ఎంపికచేసి రాష్ట్ర రాజకీయాల్లో నూతన శకానికి నాంది పలికారు. 

మహిళలకు భద్రత..

బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎంపికైన తర్వాత సువేందు భావోద్వేగానికి లోనయ్యా రు. బంగాల్‌లో ‘భయం పోయి భరోసా కల్పించాల్సిన సమయం’ వచ్చిందన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, ‘సోనార్ బంగ్లా’ను ఏర్పాటు చేయాల్సి ఉంద న్నారు. ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకి, తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అమిత్ షాను ఆయన ఆధునిక చాణక్యునిగా అభివర్ణించారు.  ముందుగా బంగాల్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. తనను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసి, తన బాధ్యతను మరింత పెంచారని, దాన్ని సక్రమంగా నిర్వహిస్తాను బంగా ల్‌కు సువేందు స్పష్టంచేశారు.

కల నెరవేరింది

  • అమిత్‌షా ఆనందం

బంగాల్ ప్రజలు ప్రధాని మోదీ పాలనను విశ్వసించినందుకు కేంద్రహోం మంత్రి అమిత్ షా  ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బంగాల్ ప్రజలకు చేతులెత్తి నమస్కరించారు. గంగోత్రి నుంచి గంగాసాగర్ వర కు నేడు బీజేపీ అధికారంలో ఉంద ని, బంగాల్‌లో బీజేపీ జెండా ఎగురవేయాలన్న కల నెరవేరింద న్నారు. ఆర్టికల్ 370 రద్దు అయినప్పుడు కూడా ఇలాగే దేశవ్యాప్త ప్రజలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తంచేశారని గుర్తుచేశారు.

9 జిల్లాల్లో టీఎంసీ కనీసం ఖాతా తెరవలేకపోయిందని, దీదీ రాజకీయా న్ని తుడిచి పెట్టేశామని స్పష్టంచేశా రు. చొరబాటుదారుల సమస్య జా తీయ భద్రతకు సంబంధించిందని, ఇందులో ఎలాంటి వెనుకడుగూ ఉండబోదని తెలిపారు. మమతా బెనర్జీ పాలనలో నేరస్థులు రాజకీయ నాయకులుగా మారారని, అభివృద్ధికి ఆస్కారం లేకుండా పోయిందని, ఇక ఇదంతా కొన్ని నెలల్లోనే ముగిసిపోతుందని చెప్పారు.

బంగాల్‌లో సుభిక్ష పాలన అందించేందుకు తమ బాధ్యత మరింత పెరిగిందని అమిత్‌షా వివరించారు. బంగాల్ భయం నుంచి విముక్తి పొందేందుకు ప్రజలు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, వారి ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడిగా సువేందు అధికారి సేవలందిస్తారని స్పష్టం చేశారు. బీజేపీ ఇంతపెద్ద శాసనసభా పక్ష బలగాన్ని చూసి మనసు సంతోషంతో ఉప్పొంగిపోతోందని, బంగారు బంగాల్ లక్ష్యాన్ని సాధించే బాధ్యతను ప్రజలు మన భుజస్కంధాలపై ఉంచారని ఎమ్మెల్యేలకు సూచించారు.

బీజేపీ కార్యకర్తలందరూ ఇందుకు సహకరించాలన్నారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోరాటాలకు, త్యాగాలకు నేడు నిజమైన నివాళి ఇదేనని, ఆయన వేసిన పునాదిపై బంగాల్‌లో తొలిసారిగా బీజేపీ పూర్తి మెజార్టీని సాధించడం సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.

మార్పుకోసం వేసిన పునాది బంగాల్‌కు పునర్‌వైభవం తీసుకొస్తున్నదని, అసోంలో చొరబాటు సమస్యను అరికట్టినట్లే ఇక్కడ అరికడతామని స్పష్టం చేశారు. తద్వారా అక్రమ వలసలను పూర్తిగా నిరోధిస్తామని, చొరబాటు సమస్యపై అత్యంత కఠిన వైఖరిని తీసుకొని విజయం సాధించామని, దీన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తామని అమిత్‌షా పేర్కొన్నారు.