4 August, 2026 | 2:32 AM

వంతెన సిద్ధం.. రహదారి అధ్వానం

04-08-2026 12:33 AM

ప్రయాణికులకు తప్పని 

ఇబ్బందులు.. ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా అధికారులు..?

రామారెడ్డి, ఆగస్టు 3 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని గంగమ్మ వాగుపై నిర్మించిన వంతెన పనులు పూర్తయినప్పటికీ, దానికి అనుసంధానంగా ఉండాల్సిన రోడ్డు మరమ్మతు పనులు మాత్రం ఇప్పటికీ కొలిక్కి రాకపోవడం స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది.

వంతెన సిద్ధమైనా, దారి పూర్తిగా అస్తవ్యస్తంగా ఉండటంతో వాహనదారులు నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో బురద, గుంతలతో నిండిన ఈ రహదారిపై ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. బస్సులు, లారీలు సైతం ఈ మార్గంలో వెళ్లేందుకు జంకుతూ, ప్రత్యామ్నాయ దారుల్లో తిరగాల్సి వస్తోంది. ఫలితంగా ప్రయాణ సమయం రెట్టింపు అవుతుండటంతో పాటు, ప్రమాదాల భయం వెంటాడుతోందని గ్రామస్తులు చెబుతున్నారు.

నెలల తరబడి ఈ సమస్యపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారుల నుంచి కానీ, ప్రజాప్రతినిధుల నుంచి కానీ స్పష్టమైన హామీ లభించడం లేదని బాధితులు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో అభివృద్ధి గురించి పెద్దపెద్ద మాటలు చెప్పిన నేతలు, ఇప్పుడు ఈ ప్రాథమిక అవసరాన్ని కూడా తీర్చలేకపోతున్నారని జనం మండిపడుతున్నారు. కేవలం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకే పరిమితమై, పనుల పురోగతిని ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు సరిగా లేకపోవడం వల్ల ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితేనే యంత్రాంగం కదులుతుందా అని స్థానికులు నిలదస్తున్నారు. ఇదే సమయంలో, ఇటీవలి  వర్షాలు, వరదలు జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేశాయి.

తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు ముఖ్యంగా తీవ్రంగా నష్టపోయాయి.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పాలకులు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అయితే క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు ఆశించిన వేగంతో సాగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మరమ్మతు పనులను వెంటనే చేపట్టి, ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పించాలని రామారెడ్డి మండల ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.ప్రజా ప్రతినిధులు కేవలం మాటలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను స్వయంగా పరిశీలించి, పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.