4 August, 2026 | 2:32 AM

ఏపీలో జల్ జీవన్ బిల్లుల రచ్చ

04-08-2026 12:30 AM
  1. కూటమి సర్కార్‌లో కలకలం
  2. ఐఏఎస్ అధికారి బదిలీ.. కీలక స్థానంలో పోస్టింగ్
  3. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఊహించని పరిణామం
  4. ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న బడా కాంట్రాక్టర్
  5. రీ డిజైన్ ప్యాకేజీలపైనా సదరు గుత్తేదారు కన్ను

హైదరాబాద్, ఆగస్టు3 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్‌లో జల్ జీవన్ బిల్లుల విడుదల వ్యవహారం రచ్చరచ్చ అవుతోంది. జల్ జీవన్ మిషన్ కింద పూర్తయిన పనులకు సంబంధించి నిధుల విడుదల ప్రక్రియ ఏపీ ప్రభుత్వ వర్గాల్లో ఊహించని వివాదాని కి దారితీసింది. కాంట్రాక్టర్ల ఒత్తిళ్లు, ఆర్థికశాఖ వైఖరి, డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ మధ్య నెలకొన్న విభిన్న పరిస్థితులను ఈ వ్యవహారం బట్టబయలు చేసింది.

దీంతో పవన్ కళ్యాణ్‌కు ఊహించని పరిణామం ఎదురైం ది. ప్రభుత్వంలో ఓ బడా కాంట్రాక్టర్ చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. పంచాయతీ రాజ్ శాఖ పరిధిలోని జల్ జీవన్ మిషన్ పెండింగ్ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు నెల రోజుల క్రితం నిధులను విడుదల చేసిం ది. రాష్ట్రవ్యాప్తంగా పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల చెల్లింపు కోసం ఎదురుచూస్తున్నారు.

వచ్చిన నిధులు పనులు పూర్తున కాంట్రాక్టుల సీనియారిటీ, నిబంధనల ప్రకారం అందరికీ పంపిణీ అవుతాయని అంతా భావించారు. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కాంట్రాక్టర్ల వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీశాయి. వచ్చిన నిధుల్లో చాలా పెద్ద మొత్తాన్ని ఒక పెద్ద కాంట్రాక్టర్‌కు చెందిన బిల్లులను క్లియర్ చేయడానికే తొలుత ఉపయోగించారని, మిగిలిన అనేక మంది కాంట్రాక్టర్లను పక్కన పెట్టారని ఆరోపణలు వచ్చాయి.

ప్రభుత్వంలోని వివిధ స్థాయిల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిళ్లు, లాబీయింగ్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. జల్ జీవన్ మిషన్ అనేది పవన్ కళ్యాణ్ పర్యవేక్షించే పంచాయతీ రాజ్ శాఖ పరిధిలోకి రావడంతో ఈ అంశం రాజకీయ ప్రాధాన్యత సంతరించు కుంది. తమకు అన్యాయం జరిగిందని భావించిన కాంట్రాక్టర్లు డిప్యూటీ సీఎంను కలిసి, బిల్లుల చెల్లింపులో జరుగుతున్న వివక్షపై ఫిర్యాదు చేశారు.

ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. పెండింగ్ పనులను పూర్తిచేయడానికి తీసుకొచ్చిన నిధులను.. పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లను పక్కన పెట్టి, ఒకే ఒక్క కాంట్రాక్టర్‌కు ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. ఈ వ్యవహారం కాస్త ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి వెళ్లడంతో, ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఆర్థిక శాఖ అదనపు నిధులను విడుదల చేసి, అర్హులైన ఇతర కాంట్రాక్టర్ల బిల్లులను కూడా క్లియర్ చేయడంతో ప్రస్తుతానికి ఆ వివాదం పూర్తిగా సమసిపోలేదు.

అధికారి బదిలీ.. వ్యూహాత్మక స్థానం

నిధుల విడుదల అయినంత మాత్రాన ఈ వివాదం పూర్తిగా సమసిపోలేదు. ఈ పరిణామం జరిగిన వెంటనే, పంచాయతీ రాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి శశిభూషణ్ కుమార్‌ను ఆ శాఖ నుంచి తప్పించారు. జల్ జీవన్ మిషన్ బిల్లుల వివాదం వల్లే ఈ బదిలీ జరిగిందనే ప్రచారం ప్రభుత్వ, రాజకీయ వర్గాల్లో పెద్దయెత్తున జరిగింది. అయితే.. పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా పనిచేస్తున్న ఆయనను అక్కడి నుంచి బదిలీ చేసి కీలకమైన నీటిపారుదల (వాటర్ రిసోర్సెస్) శాఖ ప్రిన్సిపల్ సెక్రట రీగా నియమించడమే.. బదిలీ కంటే ఎక్కువ చర్చనీయాంశమయ్యింది.

భారీ ప్రభుత్వ వ్యయంతో కూడుకున్న ప్రాజెక్టులను పర్యవేక్షించే మరో వ్యూహాత్మక శాఖకు ఆయనను పంపడం గమనార్హం. దీనిపై బ్యూరోక్రసీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అధికారిపై చర్యలు తీసుకోవడానికి బదులుగా, ఆయనకు మరింత ప్రాధాన్యం ఉన్న పదవిని కట్టబెట్టారా (కిక్డ్ అప్‌స్టేర్స్)? అనే చర్చ లోతుగా సాగుతోంది. జల్‌జీవన్ మిషన్ వివాదంలో ఉన్న అదే ప్రముఖ కాంట్రాక్టర్, ప్రభుత్వంలో తనకున్న పరిచయాలను, పట్టును ఉపయోగించి బదిలీ అయిన ఐఏఎస్ అధికారికి అంతకంటే కీలకమైన మరో పోస్టింగ్ వచ్చేలా చేశారని రాజకీయ, ప్రభుత్వ వర్గాల్లో వినపడుతోంది. అయితే, దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు.

10 ప్యాకేజీలుగా రీ-డిజైన్..

సదరు బడా కాంట్రాక్టర్ గతంలో 7 ప్యాకేజీలను నిర్వహించారు. అందులో ఒకట్రెండు పెద్ద ప్యాకేజీల విషయంలో మరెవ్వరూ అర్హత సాధించకుండా కేవలం ఆయనకే దక్కేలా రూపొందించారనే ప్రచారం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ వ్యవహారం తర్వాత, ఆ 7 ప్యాకేజీలను పునర్వ్యవస్థీకరించి 10 ప్యాకేజీలుగా రీ-డిజైన్ చేశారు.

రాబోయే రోజుల్లో ఎన్‌హెచ్‌ఏఐ తరహాలో ఈ 10 ప్యాకేజీలను అంచనా వ్యయం కంటే తక్కువ రేట్లకు 5 నుంచి 10 మంది పోటీపడి పారదర్శకంగా దక్కించుకుంటారా? లేక అదే పెద్ద కాంట్రాక్టర్ మళ్లీ ఇతర కాంట్రా క్టర్లతో కలిసి ఒక సిండికేట్ (కార్టెల్)గా ఏర్పడి అంచనాల కంటే ఎక్కువ ధరకు కోట్ చేసి, ఆ 10 ప్యాకేజీల ను 7 మంది కాంట్రాక్టర్లే పంచుకుంటా రా? అనేది కాలమే సమాధానం చెప్పాలి. ప్రజలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రజల కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఈ పరిణామాలపై కన్నేసి ఉంచారనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు!

పవన్ కళ్యాణ్‌కు తొలి పరీక్ష

తమ శాఖల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని పదేపదే చెప్పే పవన్ కళ్యాణ్‌కు తాజాగా జరిగిన పరిణామం అత్యంత ప్రాధాన్యత సంచరించుకుంది. అదే సమయంలో ప్రభుత్వం పరిధిలో పనులు చేసే బడా కాంట్రాక్టర్ల చుట్టూ తిరిగే క్లిష్టమైన రాజకీయ సమీకరణాలను కూడా ఈ సంఘటన బట్టబయలు చేసింది. తీవ్రమైన ఆర్థిక, కాంట్రాక్టర్ల ప్రయోజనాలు దాగి ఉన్న చోట పవన్ కళ్యాణ్ తన శాఖపై ఎంతవ రకు పాలనాపరమైన నియంత్రణ సాధించగలరనే దానికి ఈ వివాదం ఒక పరీక్షగా నిలిచింది. ఆయన జోక్యం చేసుకోవడం, ఆ తర్వాత ఇతర కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల కావడం ద్వారా పంచాయతీ రాజ్ శాఖలోకి ఒక స్పష్టమైన సందేశం వెళ్లింది.

అయితే.. వివాదం తర్వాత ఒక సీనియర్ అధికారిని తొలగించి, వెంటనే అంతే ప్రాధాన్యత కలిగిన స్థానానికి బదిలీ చేయడం అనేది జవాబుదారీతనమా? లేక కేవలం ఒక సాధారణ బదిలీయేనా? అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతోంది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంతో జల్ జీవన్ మిషన్ వివాదం తాత్కాలికంగా ముగిసి ఉండవచ్చు. కానీ, నిధుల విడుదలను ఎవరు ప్రభావితం చేస్తున్నారు. అధికార యంత్రాంగంలో కాంట్రాక్టర్లు ఎలా పట్టు సాధిస్తున్నారు? మంత్రి వర్గాల అధికారం ఎక్కడ ముగుస్తుంది, అధికారులపై -కాంట్రాక్టర్ల ప్రభావం ఎక్కడ  మొదలవుతుంది? అనే ప్రశ్నలు మాత్రం అంత సులభంగా మాయమయ్యేలా లేవు.