30 April, 2026 | 2:51 AM

మంథని వ్యాపార అభివృద్ధి కోసమే రోడ్డు నిర్మాణం

30-04-2026 01:37 AM

ప్రతిపక్ష పార్టీవ నిరాధార  విమర్శలు

రైతులను ముంచిన ఘనత బీఆర్‌ఎస్ పార్టీ పుట్టదే

మంథనిలో విలేకరులతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సెగ్గెం రాజేష్  

మంథని, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): మంథని పట్టణాన్ని వ్యాపార కేంద్రంగా మార్చే లక్ష్యంతోనే ప్రభుత్వం రోడ్డు నిర్మాణ పనులను చేపట్టిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సెగ్గం రాజేష్ స్పష్టం చేశారు. బుధవారం మంథని గోదావరి నది ఒడ్డున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్డు విస్తరణ ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, పట్టణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆయన తెలిపారు.

రైతుల రక్తం తాగింది మీ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మాజీ జడ్పీటీసీ  పుట్ట మధుదే అని రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన గుర్తు చేశారు.గత ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రైతులను నిలువునా ముంచిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ది అని తక్కువ పరిహారం ఇచ్చి, అర్ధరాత్రి వేళ మెగా కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్లు చేయించి రైతుల కడుపు కొట్టారని ఆయన  విమర్శించారు.

దానికి భిన్నంగా, ప్రస్తుత ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణం కోసం భూములు ఇస్తున్న రైతులకు మార్కెట్ విలువ కంటే ఎనిమిది నుండి పది రెట్లు ఎక్కువ పరిహారం చెల్లిస్తోందన్నారు. గోదావరి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి అలాగే నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పూర్తయితే మంథని పట్టణం వ్యాపారపరంగా ఎంతో అభివృద్ధిని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒకరి లాభం  అందరి ప్రగతి అంటూ నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలి అన్నారు.

రోడ్డు నిర్మాణం వల్ల ఒకరు లాభపడితే మరొకరికి నష్టం జరుగుతుందనే దుష్ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. అభివృద్ధి అనేది అందరి కోసం జరుగుతోందని, మొత్తం పట్టణ ప్రగతిని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ఆయన తెలిపారు.నిరాధార విమర్శలు చేస్తే ఊరుకోము సహించేది లేదన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలకు గట్టి హెచ్చరిక చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రతిపక్షం ఇచ్చే ఏ మంచి సూచననైనా ప్రభుత్వం స్వాగతిస్తుందని అదే పనిగా నిరాధార విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే తిరిగి మళ్ళీ ప్రజా ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని తెలుసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

మంథని పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రగతి చక్రం ఆగదని ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో   మంథని మున్సిపల్ వైస్ చైర్మన్ సహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మూల పురుషోత్తం రెడ్డి, బెజ్జంకి డిగంబర్, పేరవేని లింగయ్య యాదవ్, పాపారావు, ఐలీ శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్, మంథని రాకేష్, పెంటరీ రాజు, కాశిపేట బాపూ, ఊదరి ఓదెలు, ఉట్ల అనిల్ రెడ్డి దొనగోర్ల శ్రీనివాస్, గోవిందుల రమేష్, ఇందారపు అనిల్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.