సరికొత్త కావ్యలోకాన్ని తలపించే రామాయణ
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, దాదాపు రూ. 4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న విజువల్ ఎపిక్ ‘రామాయణ’. మొత్తం రెండు భాగాల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా తొలిభాగం ట్రైలర్‌ను మేకర్స్ గురువారం తెల్లవారుజామున 4:15 గంటలకు, శాస్త్రోక్త బ్రహ్మ ముహూర్తంలో విడుదల చేశారు.
దర్శకుడు నితీశ్ తివారీ మలిచిన ఈ దృశ్య కావ్యం, విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడి యాలో రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతోంది. దాదాపు 4 నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ట్రైలర్ మొత్తం ఒక సరికొత్త కావ్య లోకాన్ని తలపించేలా అద్భుతమైన విజువల్స్, నెక్స్ లెవెల్ వీఎఫ్‌ఎక్ట్స్ హంగులతో టెక్నికల్ వండర్‌గా రూపొందింది. పుష్పక విమానం, ఐరావతం, జటాయువు ఘట్టాలను గ్రాఫిక్స్ ద్వారా కంటికి కట్టినట్లు ఎంతో సహజంగా తీర్చిదిద్దారు.
అంతర్జాతీయ సంగీత విద్వాంసుడు హాన్స్ జిమ్మెర్, భారతీయ ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌లోని ప్రతి ఫ్రేమ్‌కు ప్రాణం పోసింది. ‘దేవలోకం.. భూలోకం.. పాతాళలోకం.. ముల్లోకాల్లో ఇక ఒక్కటే సామ్రాజ్యం.. రావణ రాజ్యం’ అంటూ యశ్ పాత్రను పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమైంది. ‘చీకట్లను పారదోలేందుకు ప్రతి యుగంలోనూ ఆ శ్రీమహావిష్ణువు అవతారమెత్తుతాడు’ అంటూ రాముడి పాత్రను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంది.
ప్రశాంతత, ధర్మనిష్ఠను ప్రతిబింబించే రాముడిగా రణ్‌బీర్ కపూర్ ఆకట్టుకున్నారు. సౌమ్యం, దివ్యత్వంతో కూడిన నటనతో రాముడి పాత్రకు చక్కగా సరిపోయారు రణ్‌బీర్. రావణుడి పాత్రలో యశ్ స్క్రీన్‌పై కనిపించిన ప్రతిసారీ తన గాంభీర్యం ప్రేక్షకులను మైమరిపించింది. రౌద్ర రూపంలో ట్రైలర్‌ను పూర్తిగా డామినేట్ చేశారు యశ్. సాయిపల్లవి తనదైన సహజ నటన, సరళత, సౌమ్యతతో సీతాదేవి పాత్రకు సంపూర్ణ గౌరవాన్ని తెచ్చారు.
అరుణ్ గోవిల్పాత ’రామాయణం’ సీరియల్ రాముడు అరుణ్ గోవిల్, ఇందులో దశరథుడిగా భారమైన హృదయంతో వనవాసానికి పంపే తండ్రిగా మెప్పించారు. లక్ష్మణుడిగా రవి దూబే, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ తమ పాత్రల్లో మెరిశారు. అయితే, ఈ ట్రైలర్‌లో సన్నీ డియోల్ పోషిస్తున్న హనుమంతుడి పాత్రను చూపించకపోవడం అభిమానులను కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్‌ఈజీ, యశ్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ‘రామాయణ: పార్ట్ 1’ ప్రపంచవ్యాప్తంగా ఇదే ఏడాది దీపావళి సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని అంతర్జాతీయంగా సోనీ పిక్చర్స్ విడుదల చేయనుండగా, ఉత్తర భారతదేశంలో ధర్మ ప్రొడక్షన్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.






