పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియ పక్కాగా పూర్తి చేయాలి
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, జులై 8 (విజయక్రాంతి) : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను పక్కాగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పోలింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్ల సంఖ్య 1200 దాటితే అక్కడ అదనంగా మరో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా, ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఆయా ప్రాంతాల్లో కొత్త పోలింగ్ స్టేషన్ అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా పేర్ల సవరణ, ప్రదేశాల మార్పు, కొత్త కేంద్రాల ఏర్పాటు అనే మూడు అంశాలపై దృష్టి పెట్టినట్లు వివరించారు.
షెడ్యూల్ ప్రకారం పనులు..
పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ ప్రక్రియకు సంబంధించి క్లియర్ కట్ షెడ్యూల్ ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.జులై 24న కొత్త కేంద్రాల ప్రతిపాదనలు పంపబడతాయని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి లబించిన పిమ్మట, జులై 31న కొత్త కేంద్రాలతో కూడిన ’డ్రాఫ్ట్ జాబితా’ను విడుదల చేస్తామని తెలిపారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల సూచనలు, అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. తహసీల్దార్, ఆర్డీఓ స్థాయిల్లో జరిగే సమావేశాలకు మండల మరియు నియోజక వర్గ స్థాయి రాజకీయ పార్టీ ప్రతినిదులుహాజరై తమ సూచనలు, అభ్యంతరాలు తెలపాలని కోరారు. రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ‘ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ ప్రేమ్ రాజ్, ఫిదా రాజకీయ పార్టీల నాయకులు సిహెచ్ రాజేశ్వరరావు, కోట గోపి, స్టాలిన్ అజిత్, చల్లమల్ల నరసింహ, సత్యనారాయణ, కరుణాకర్ రెడ్డి, రమేష్ ఎలక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






