సాగునీటి పనుల్లో వేగం పెంచాలి
ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రు నాయక్
మహబూబాబాద్, మే 5 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రు నాయక్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో నియోజకవర్గ పరిధిలోని ఇరిగేషన్ ఎస్ ఈ, ఈ ఈ, ఏడు మండలాల ఇరిగేషన్ డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా సాగుతున్న నీటి పారుదల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు..నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులకు గల అడ్డంకులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించి పనులు ప్రారంభించాలని సూచించారు.
మంజూరైన నిధులను సద్వినియోగం చేస్తూ, పనుల్లో నాణ్యత పాటించాలని స్పష్టం చేశారు. రైతాంగానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా చెరువుల పునరుద్ధరణ, కాలువల మరమ్మతు పనులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పనులు ఆగిపోతే సహించేది లేదని, అటువంటి వారిపై నివేదికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.






