10 July, 2026 | 1:51 AM

మూసీ రివర్ ఫ్రంట్‌కు రూ.7,345 కోట్లు

10-07-2026 12:01 AM
  1. పరిపాలనా అనుమతులు జారీ  
  2. ఫేజ్-1 పనులను   పరిశీలించిన సీఎస్ సంజయ్ జాజు
  3. ‘మూసీ-ఈసా’ మధ్య మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు ఆదేశం

హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు తొలి దశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ంది. భూ సేకరణ నిమిత్తం రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు ఇస్తూ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రాజెక్టు అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జోన్--1ఏ, జోన్--1బీ కారిడార్లలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9.20 కిలోమీటర్లు, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.80 కిలో మీటర్లు మొత్తం 21 కిలో మీటర్ల మేర ప్రాధాన్య స్ట్రెచ్‌లో రివర్ ఫ్రంట్  పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) నుంచి రూ.4,500 కోట్ల రుణం అందనుండగా, మిగిలిన రూ.2,845.12 కోట్లు హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ సంస్థలు సమకూర్చనున్నాయి.

పనులను ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో చేపట్టనున్నారు. ప్రాజెక్టు అమలు, నాణ్యత, పురోగతిని పర్యవేక్షణకు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్(పీఎంసీ) నియామకానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే ఏడీబీ మార్గదర్శకాల ప్రకారం టెండర్లు, ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియ చేపట్టాలని, ప్రాజెక్టు అమలుకు అవసరమైన తదుపరి చర్యలు వెంటనే ప్రారంభించాలని మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్‌డీసీఎల్)కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లాలి

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు తొలి దశ (జోన్-1ఏ) క్యారిడార్‌ను గురువారం ప్రభుత్వ సీఎస్ సంజయ్ జాజు పరిశీలించారు. ఉస్మాన్ సాగర్, నర్సింగి ఎస్టీపీ సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్) ప్రాంతం, గాంధీ సరోవర్ ప్రాజెక్టు భూములను సందర్శించారు. ఎంఆర్డీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్బీ మేనేజింగ్ డైరెక్టర్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో  చర్చించారు. 

అలాగే మూసీ, ఈసా నదుల మధ్య గాంధీ సరోవర్ సంగమం వరకు ఉన్న ప్రాంతానికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్‌ను ఎంఆర్డీసీఎల్, హెచ్‌ఎండీఏ సంయుక్తంగా రూపొందించాలని స్పష్టం చేశారు. దీంతో నదీతీర ప్రాంతంలో మెరుగైన అనుసంధానం, ప్రణాళికాబద్ధమైన పట్టణాభివృద్ధి, సుస్థిర వృద్ధి సాధ్యమవుతుందని సీఎస్ పేర్కొన్నారు.