10 July, 2026 | 3:08 AM

కలెక్టర్ చెప్పినా.. మారరా

10-07-2026 12:44 AM

జిల్లా అధికారుల తీరుపై అసహనం

ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్న కలెక్టర్..!

ఎఫ్‌ఆర్సీ అమలుతో ఉద్యోగ విధులపై నిఘా.

మరో అహ్మద్ బాబు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం

నిర్మల్ జులై9 (విజయకాంతి): నిర్మల్ జిల్లాలో గాడి తప్పిన పాలన గాడిలో పెట్టేందుకు కలెక్టర్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రభుత్వానికి ప్రజలకు జవాబుదారితనంగా పనిచేయాలని కలెక్టర్ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల విషయంలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేయడం జిల్లాలో చర్చని అంశంగా మారింది.

కలెక్టర్ చెప్పిన కొందరు అధికారులు మారడం లేదని కలెక్టర్ గాటుగా హె చ్చరికలు చేయడం ఈ వాదాలకు మరింత బలం చేకూర్స్తుంది.నిర్మల్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన భవేష్ మిశ్రా పరిపాలన ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలో పనిచేస్తున్న వివిధ శాఖల్లో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుతూ ప్రభుత్వ పథకాలను పేదలకు అందించి పరిపాలనలో పారదర్శకత ఉండేలా కలెక్టర్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనితీరు మెరుగుపరచుకొని ప్రభుత్వానికి ప్రజలకు జవాబుదారితనంగా పనిచే యాలని అధికారులను సున్నితంగా హెచ్చరిస్తూనే పరిపాలన ప్రజలకు చేరువయ్యేం దుకు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలను నిర్వహించి అందరినీ హడలెత్తిస్తున్నారు.

నిర్మల్ జిల్లాలో మొత్తం 18 మండలాలు, మూడు మున్సిపాలిటీలు, 400 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటికీ ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన కలెక్టర్.. ప్రతి గ్రామంలో నెలకొన్న సమస్యలు, ప్రజల జీవన విధానం, స్థానిక సమస్యలు, ప్రభుత్వానికి నివేదించవలసిన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని చక్కదిద్దే కార్యక్రమాన్ని స్వయంగా అమలు చేస్తూనే తోటి ఉద్యోగులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో సమర్థవంతంగా మొక్కజొన్న, వరి ధాన్యం, జొన్న కొనుగోళ్లను సమర్థవంతంగా పూర్తి చేసి రైతుల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. రెండు నెలల పాటు తాను కష్టపడుతూ తన కిందస్థాయి అధికారులకు సూచనలు చేస్తూ ఎలాంటి సమస్య లేకుండా సంపూర్ణంగా పూర్తి చేశారు.

ఎఫ్‌ఆర్సీ అమలుపై ప్రత్యేక దృష్టి.

ప్రభుత్వ శాఖల్లో పని చేసే ఉద్యోగుల పనితీరును ప్రామాణికంగా గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ జిల్లాలో ఎఫ్‌ఆర్సీ ( ఫేస్ రికగ్నైజ్డ్ సిస్టం) అమల్లోకి తీసుకొచ్చారు. జిల్లాలో 42 శాఖల్లో పనిచేస్తున్న జిల్లా అధికారిని మొదలుకొని క్రింది స్థాయి అటెండర్ వరకు ముఖ గుర్తింపు హాజరు ఆన్లైన్ డేటా ప్రతిరోజు పరిశీలిస్తున్నారు. ఏ శాఖలో ఎంతమంది ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరవుతున్నారు.

హాజరైన వారు కార్యాలయంలో ఉండి పనిచేస్తున్నారా..? లేక అనుమతి లేకుండా ఉద్యోగులు బయటకు వెళ్తున్నారా అనే అంశాలపై పూర్తి డేటాను సేకరించి ఆయా జిల్లా అధికారుల సమక్షంలోనే రిపోర్టును చదివి వినిపిస్తున్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను నెల రోజుల వ్యవధిలో పరిష్కరించాలని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దరఖాస్తులను పరిష్కరించని యెడల ఎడల దాన్ని డిస్ప్లే చేయాలని సూచిస్తున్నారు. మండల, జిల్లా స్థాయిలో ప్రజలు వారి అవసరాల కోసం వచ్చి అర్జీలు ఇస్తే వాటిని తక్షణం పరిష్కరించాలని సూచిస్తున్నారు.

ప్రభుత్వం ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాల అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రోజువారి ప్రోగ్రెస్ రిపోర్టులు సమర్పించాలని సూచిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటలకు ఏదో ఒక ప్రాంతంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేస్తూనే అదనపు కలెక్టర్ లు కిషోర్ కుమార్, వెంకటేశ్వర్లు, బైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులు, కేజీబీవీ, గురుకుల, ప్రభుత్వ పాఠశాలలు, విత్తనాలు, ఎరువుల దుకాణాలను, తనిఖీలు నిర్వహించి ప్రభుత్వ యొక్క ప్రాధాన్యతను పరిపాలన పారదర్శకతను నొక్కి చెప్పారు. 

కలెక్టర్ కార్యాలయంలో సమయపాలన పాటిస్తూ నిర్దేశించిన సమయానికి సమావేశాలు, సమీక్షలు పూర్తిచేసి మంచి చేస్తున్న అధికారులకు మెచ్చుకుంటూనే నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై ఆగ్రహం అసంతృప్తి వ్యక్తం చేస్తూ పనితీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు.

మరో అహ్మద్ బాబు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం.

2014 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన అహ్మద్ బాబు అప్పటి పరిపాలన గాడిలో పెట్టేందుకు చేపట్టిన చర్యలను ఇక్కడి జిల్లా ప్రజలు, ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఆయన ఆకస్మిక తనిఖీలు పనితీరులో పాదర్శికత పరిపాలన పరమైన మార్పు కోసం ప్రజలకు జవాబుదారితనంగా నిలిచేందుకు ఉమ్మడి జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అధికారులను హడలెత్తించారు.

క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలపై పరిశీలించి అవినీతి అక్రమాలకు ఆస్కారం ఇవ్వకుండా పరిపాలనలో పారదర్శకత చేపట్టి అనతికాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  ప్రస్తుతం నిర్మల్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న భవేష్ మిశ్రా కూడా అదే తీరుతో ముందుకు వెళ్తున్నారు. ఆయన అమలు చేస్తున్న పరిపాలన పరమైన మార్పులు జిల్లా ప్రజలకు పాలన మరింత చేరువచేసి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు చేసేందుకు దోహదపడతాయని జిల్లా ప్రజలు అభిప్రాయప డుతున్నారు.