7 May, 2026 | 7:48 AM

పేదల సమస్యలను పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ ఉద్దేశం

07-05-2026 12:00 AM
  1. గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యం 
  2. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు
  3. రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి దనసరి అనసూయ సీతక్క

ములుగు (మహబూబాబాద్) మే 6 (విజయక్రాంతి): పేదల సమస్యలను సత్వరమే పరిష్కరించడమే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజల అర్జీలను ప్రణాళిక బద్ధంగా పరిష్కరిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించడమే ముఖ్య ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం ములుగు జిల్లాలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామం లోని ఆశ్రమ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజా దర్బార్ కార్యక్రమంలో ‘ప్రజా దర్బార్ దరఖాస్తు ఫామ్’ ను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు, ఐటిడిఏ పిఓ లెనిన్ వత్సల్ టోప్పో లతో కలిసి ఆవిష్కరించి, కొండాయి, దొడ్ల, మల్యాల, దొడ్ల కొత్తూరు, గోవిందరాజుల కాలనీ గ్రామాల ప్రజల నుంచి  దరఖాస్తులను స్వీకరించారు.

అనంతరం ఏటూరు నాగారం మండలం చిన్నబోయిన పల్లి గ్రామం లోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో  ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజా దర్బార్ కార్యక్రమంలో చిన్నబోయినపల్లి, శివాపూర్, షాపల్లి గ్రామాల ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భాల్లో  మంత్రి  సీతక్క మాట్లాడుతూ ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడమే ప్రధాన ఉద్దేశంతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ములుగు జిల్లాలో వినూత్నంగా గ్రామాలలో ప్రత్యేక ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వడివడిగా గ్రామాలలోని ప్రజల సమస్యలను ప్రణాళిక బద్ధంగా పరిష్కరించుకుంటూ జిల్లాను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు.

ప్రజా దర్బార్ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకునే ఫిర్యాదు దారుల కోసం ప్రత్యేకంగా దరఖాస్తు ఫారాన్ని రూపొందించడం జరిగిందని అందులో అర్జీదారులు తమ సమస్యలను తెలియజేయవచ్చని అన్నారు.  కొండాయి గ్రామంలో అర్హులైన 115 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. జంపన్న వాగు ప్రవాహం ఒడ్డున ఎట్టి పరిస్థితుల్లో ఇండ్లను నిర్మించుకోకుండా సురక్షిత ప్రాంతాలలో శాశ్వత ప్రతిపాదికన ఇండ్లను నిర్మించుకోవాలని సూచించారు.

నూతన గ్రామపంచాయతీ పాలకవర్గం కొలువుదీరిన అనంతరం గ్రామాలలోని సమస్యలను పరిష్కరించడం కోసం నిధులు కేటాయిస్తున్నామని, గ్రామసభల ఆమోదం ద్వారానే ప్రజలకు అవసరమయ్యే అభివృద్ధి పనులకు నిధులను  వెచ్చించాలని అన్నారు. ప్రత్యేక ప్రజా దర్బార్ కార్యక్రమంలో అనేకమంది ఫిర్యాదుదారులు ఎక్కువ సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, నూతన పెన్షన్ల మంజూరు, అటవీ భూముల సమస్యలు గూర్చి అర్జీలు సమర్పిస్తున్నారని వాటన్నిటిని ప్రణాళిక బద్ధంగా సంబంధిత అధికారులతో సమగ్రంగా పరిశీలించి అర్హులైన జాబితా సిద్ధం చేస్తున్నామని, రెండవ విడతలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు.

జూన్ మాసంలో నూతన పెన్షన్లను అందించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు. అటవీ భూముల పలు సమస్యలు తలెత్తుతున్న తరుణంలో త్వరలోనే అటవీశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించి సమస్యలను పరిష్కరించే విధంగా విధివిధానాలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు. అడవులను కాపాడే బాధ్యత అందరిపై ఉందని రాష్ట్రంలోనే అధిక అటవీ విస్తీర్ణంలో  ములుగు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు.

పదవ తరగతి ఫలితాలలో ములుగు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమ స్థానంలో రావడం గర్వకారణంగా ఉందని, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, కృషి చేసిన ఉపాధ్యాయులను అధికారులను, విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు. అనంతరం పదవ తరగతి ఫలితాలలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి 589/600 అత్యధిక మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచిన ఏటూరు నాగారం జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు చెందిన కోరం కున్నత్ కృష్ణను శాలువతో సత్కరించి అభినందించారు.

జిల్లాలోని అన్ని మండలాల యంసిసి కేంద్రాలకు స్వచ్ఛభారత్ మిషన్ నిదుల ద్వారా 10 కంప్యూటర్లు, స్కానర్, ప్రింటర్ లను, ఏటూరు నాగారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జీ, సంపత్ రావు, గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఆర్డిఓ వెంకటేష్, కొండాయి సర్పంచ్ ఆలం మానస, చిన్నబోయినపల్లి, షా పల్లి సర్పంచులు జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తహసిల్దార్,యంపిడిఓ,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.