25 April, 2026 | 4:03 AM

గ్రామాభివృద్ధితోనే దేశ ప్రగతి

25-04-2026 02:19 AM

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

ములుగు (మహబూబాబాద్) ఏప్రిల్ 24 (విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధి ద్వారానే దేశం ప్రగతి పథంలో పయనిస్తుందని, దేశాభివృద్ధిలో గ్రామాల పాత్ర కీలకమని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పేర్కొన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకలకు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ముఖ్య అతిథిగా హాజరై జిల్లా అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగబద్ధత లభించిందని, 1993 ఏప్రిల్ 24 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చినందున ప్రతి ఏటా ఈ రోజును జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కేవలం నినాదంగా మిగలకుండా, ములుగు జిల్లాలోని ప్రతి పల్లెలోనూ ఆచరణలోకి తేవాలని సూచించారు.

అందుకోసం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ గ్రామాల సమస్యలను గుర్తించి, ప్రజల భాగస్వామ్యంతో పరిష్కరించాలన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, అధికారులు సమన్వయంతో పనిచేసి నిధులను సక్రమంగా వినియోగించుకుని ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, పారదర్శకత, జవాబుదారీతనంతో పరిపాలన అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జీ, సంపత్ రావు, డీఆర్డీఓ చంద్రశేఖర్, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.